మరికొన్ని గంటల వరకూ అన్ని పార్టీలకూ గుండె గుబులే.. ఫలితాలు వచ్చాక కలవరమే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆ యా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా పోరాడిన రాజకీయ శక్తుల దశ, దిశలను మార్చివేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత రాజకీయ చిత్రపటాన్ని కొత్తగా చిత్రిస్తాయని అంటున్నారు.

మరికొన్ని గంటల వరకూ అన్ని పార్టీలకూ గుండె గుబులే.. ఫలితాలు వచ్చాక కలవరమే

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. కేంద్ర స్థాయిలో చూస్తే ఇది ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీలా ఉన్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కీలక రాజకీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థం చేయనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా భారత రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చవేస్తాయని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవలి భారతదేశ ఎన్నికల చరిత్రలో లేని ఉత్కంఠను ఈ ఎన్నికలు ముందుకు తెచ్చాయి. ఈ ఎన్నికలు బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాల భావి దిశను నిర్దేశించనున్నాయి.

బెంగాల్‌ ఓటమి రెండు పార్టీలకూ శరాఘాతమే

పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో నాలుగోసారి అధికారం చేపట్టేందుకు తృణమూల్‌ తహతహలాడుతుంటే.. బీజేపీ చరిత్రలోనే తొలిసారి ఈ రాష్ట్రంలో గెలిచి రికార్డు సృష్టించేందుకు కమలనాథులు ఆశపడుతున్నారు. ఎక్కువ భాగం ఎగ్జిట్‌పోల్స్‌ ఈసారి బీజేపీకి అవకాశాలు ఉంటాయని అంచనా వేసినప్పటికీ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం విజయంపై గట్టి భరోసాతో ఉన్నది. ఇక్కడ బీజేపీ గెలిచినట్టయితే.. ఓ పదిహేను రోజుల క్రితం బీహార్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినట్టుగానే.. బెంగాల్‌లోనూ మొదటిసారి బీజేపీ సీఎం వచ్చే అవకాశాలు ఉంటాయి.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నాలుగోసారి అధికారం చేపట్టినట్టయితే మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. అంతేకాదు.. 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున బలమైన ప్రధాన అభ్యర్థిగా ముందుకు వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో బీజేపీలో మోదీ హవా తగ్గిపోయిందనే విషయం మరింత బలపడుతుంది. ఇప్పటికే గత లోక్‌సభ ఎన్నికల్లో చార్‌సౌ పార్‌ అని ఊదరగొట్టినా.. కనీసం సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయిలో కూడా సీట్లు బీజేపీకి లభించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో ఓటమి.. బీజేపీకి కొత్త తలనొప్పి తీసుకురాగలదు. ప్రధాన పోస్టుకు కర్చీఫ్‌లు వేసుకున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వంటి వారు యాక్టివ్‌ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మరో కీలక అంశం ఆరెస్సెస్‌. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై ఆరెస్సెస్‌ పట్టుపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమయంలో బెంగాల్ ఓటమి ద్వారా మోదీ బలహీనపడితే.. మళ్లీ ఆరెస్సెస్‌ పట్టుబడిగించే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే మోదీ–షా ద్వయం బెంగాల్‌ను, ప్రత్యేకించి తృణమూల్‌ కాంగ్రెస్‌ను అష్టదిగ్బంధం చేసిందని అంటున్నారు. అందుకే పశ్చిమబెంగాల్‌లో బీజేపీ నుంచి మాత్రమే కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘంతోనూ ఈ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పోరాడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో ఎన్నికల సంఘం 27 లక్షలకుపైగా ఓటర్లను అడ్జడికేషన్‌లో ఉంచింది. వారిలో కేవలం 1600 మంది మాత్రమే తాము అర్హులమేనని నిరూపించుకొని ఓటేయగలిగారు. ఫాల్టా నియోజకవర్గంలో అవకతవకలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నారు. అంటే.. ఇప్పుడు 293 స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.

తమిళనాడులో విజయ్‌ పవర్‌ ఏంటి?

తమిళనాడు విషయానికి వస్తే.. డీఎంకే కూటమి అధికారం నిలుపుకొంటుందని ఎక్కువ సర్వేలు చెప్పినప్పటికీ.. ఇక్కడ అనూహ్య శక్తిగా సినీ హీరో విజయ్‌ ముందుకు రావడం గమనార్హం. విజయ్‌ దక్కించుకున్న ఓట్లు అన్నాడీఎంకే కూటమి ఓట్లా లేక డీఎంకే కూటమి ఓట్లా అన్నదానిపై అక్కడి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. డీఎంకేతో అధికారాన్ని పంచుకోవాలని కాంగ్రెస్‌ ఆశిస్తున్నది. కానీ.. డీఎంకే అందుకు ఇష్టపడటం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కేరళంలో అటు కాంగ్రెస్‌కు, ఇటు లెఫ్ట్‌కు మరణమే

కేరళంలో అటు కాంగ్రెస్‌కు, ఇటు ఎల్డీఎఫ్‌కు ఓటమి ఆ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేయనున్నాయి. వాస్తవానికి కేరళంలో ఒక టర్మ్‌ ఒక ఫ్రంట్‌, మరో టర్మ్‌ మరో ఫ్రంట్‌ అధికారంలోకి రావడం సంప్రదాయంగా వస్తున్నది. దానిని గత ఎన్నికల్లో విజయన్‌ బ్రేక్‌ చేయగలిగారు. అయితే ఇప్పుడు ఎల్డీఎఫ్‌ ఓటమిని అంతకు పరిమితం చేసి సరిపెట్టుకొనే పరిస్థితి లేదు. కేరళంలో సీపీఎం ఓడిపోవడం అంటే.. ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితిని 1977 తర్వాత మొట్టమొదటిసారి సీపీఎం ఎదుర్కొనడం అవుతుంది. ఇక ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకోగలిగిన ఏకైక రాష్ట్రం కేరళం. పదేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఓడిపోయిందంటే.. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దాని పాత్రే లేనట్టు అవుతుంది. ప్రత్యేకించి 50 శాతం మంది ముస్లింలు ఉండే కేరళంలో కాంగ్రెస్‌ ఓటమి అంటే.. ఆ పార్టీ క్షీణదశకు అడుగు దూరంలో ఉన్నట్టేనన్న అంచనాలు వెలువడుతున్నాయి.

అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అదే నిజమైతే కాంగ్రెస్‌కు ఇక్కడ కూడా గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి విజయావకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నప్పటికీ.. అక్కడ పూర్వ వైభవం సాధించడంపై డీఎంకే కూటమి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.

అసలు ఎగ్జిట్ పోల్స్‌ కరెక్టేనా?

పైన వేసిన అంచనాలన్నీ ఎగ్జిట్‌పోల్స్‌ ఆధారంగానే. కానీ.. ఎగ్జిట్‌పోల్స్‌కు అసలు విశ్వసనీయత ఎంత అనే ప్రశ్న కూడా ప్రతి ఎన్నికల్లోనూ ముందుకు వస్తూ ఉంటుంది. ఓటింగ్‌లో కొన్ని కోట్ల మంది పాల్గొంటారు. కానీ.. వారిలో కొన్ని వేల మంది అభిప్రాయాలు తీసుకొని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేయడంలో ఎలాంటి శాస్త్రీయత లేదనే వాదనలు తొలి నుంచీ ఉన్నాయి. అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ తలకిందులైన విషయాన్ని గత వరుస ఎన్నికల్లో చూస్తున్నది. ప్రత్యక్ష ఉదాహరణ బీజేపీ. గత ఎన్నికల్లో బీజేపీ చార్‌సౌ పార్‌ అని చెప్పుకొంటే.. కొన్ని ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ఉదారంగా ఇచ్చిపారేశాయి. తీరా చూస్తే నాలుగు వందల సంగతిని పక్కన పెడితే.. బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని కూడా సాధించలేక పోయింది. దానికి తోడు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు చేస్తున్న సంస్థల రాజకీయ పక్షపాతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో కీలక అంశం.. ఏ ఒక్క పోల్‌ సర్వే అంచనాలు.. మరో పోల్‌ సర్వేతో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలడం లేదు. ఇవన్నీ గమనంలో ఉంచుకుంటే.. ఎగ్జిట్‌ పోల్‌ అనేది ఆయా రాజకీయ పార్టీలకు తగిలే దెబ్బకు ముందు మందు పూయడం వంటిదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పేరుతో చానళ్లు దందా చేసుకోవడం తప్ప సాధించేది ఏమీ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లోనే భారతీయ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేయగల ఫలితాలు రానున్నాయి.