Telangana Tops In Service Sector | సేవల రంగంలో తెలంగాణ టాప్

సేవల రంగంలో తెలంగాణ దేశంలో టాప్‌లో నిలిచింది. 62 లక్షల మందికి ఉపాధి లభించగా, జాతీయ సగటు కంటే అధికంగా 34.8% మంది పనిచేస్తున్నారు.

Telangana Tops In Service Sector | సేవల రంగంలో తెలంగాణ టాప్

హైదరాబాద్, విధాత : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా చాలా మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో మొత్తం జనాభాలో 42.5 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పై ఆధారపడగా ఆ తరువాత సేవల రంగంలో 34.8 శాతం మంది పనిచేస్తున్నారు. తరువాతి స్థానాలు వరుసగా ఉత్పత్తి, నిర్మాణం, మైనింగ్, యుటిలిటీస్ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.

నీతి ఆయోగ్ మూడు రోజుల క్రితం ఇండియా సర్వీసు సెక్టార్ లో ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపులపై రెండు నివేదికలను విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే సేవల రంగలో 34.8 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో సుమారు 62 లక్షల మందికి ఉపాధి లభించింది. జాతీయ సగటు 29.7 శాతం కాగా, అంతకన్నా ఎక్కువ అనగా 34.8 శాతం మంది తెలంగాణలో వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. సేవల రంగంలో ఉప విభాగాలను పరిశీలిస్తే హోల్ సేల్ అండ్ రిటెయిల్ ట్రేడ్ లో 28.2 శాతం, ట్రాన్స్ పోర్టు అండ్ స్టోరేజీ లో 16.1, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ లో 12, ఎడ్యుకేషన్ లో 9.3, పబ్లిక్ అడ్మిన్ అండ్ డిఫెన్స్ లో 5.9, ఇతరత్రా సేవలు 5.7, వసతి, ఆహార రంగంలో 5, ఆర్థిక, ఇన్సూరెన్స్ లో 4.9, ఆతిథ్యం 4.5, ప్రొఫెషనల్, సైంటిఫిక్ 1.6, రియల్ ఎస్టేట్ 1.3, అడ్మినిస్ట్రేటివ్ 1.1, కళలు, వినోదం, రీక్రియేషన్ లో0.3 శాతం మంది చొప్పున ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 18.9 శాతం, పట్టణ ప్రాంతాలలో 68.6 శాతం, పురుషులు 41.5, మహిళలు 23.9 శాతం మంది పని చేస్తున్నారు. హైదరాబాద్ ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల్లో ఘనమైన ప్రగతి సాధించిందని చెప్పుకుంటున్నప్పటికీ ఈ రంగంలో కేవలం 12 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండడం విశేషం. హోల్ సేల్ అండ్ రిటెయిల్ వ్యాపారంలో 28.2 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నది. ట్రాన్స్ పోర్టు రంగంలో కూడా 16.1 శాతం మందికి పని లభిస్తున్నది. ఈ మూడు రంగాలు తెలంగాణలో సింహ భాగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందులో ఐటీ మినహా మిగతా రంగాలు అసంఘటిత రంగాలు కావడం గమనార్హం. అసంఘటిత రంగ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండకపోగా ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. సంస్థలో ఒక యాభై మంది పనిచేస్తే కేవలం ఇద్దరి ముగ్గురికి మాత్రమే ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను యాజమాన్యాలు అమలు చేస్తాయి. హోల్ సేల్, రిటెయిల్, ట్రాన్స్ పోర్టు విభాగాలలో గిగ్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు.

సేవల రంగంలోకి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి రవాణా సౌకర్యం, చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి డిజిటల్ గా శక్తివంతులుగా మార్చాలి. ఈ అవకాశాలను కేవలం పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా, టైర్ టూ, టైర్ త్రీ నగరాలకు విస్తరించాలి. సేవల రంగం అంటే తక్కువ వేతనాలు, చిన్న స్థాయి ఉద్యోగాలు అనే విధంగా చూడకూడదు. సమర్థత పెంచడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతిలో భాగస్వాములవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ముందున్నామని మనం చెప్పుకోవాల్సిందే. ఈ రంగంలో 1.3 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఢిల్లీలో 1.8 శాతం, కర్నాటక రాష్ట్రంలో 1.6 శాతం, ఛండీగఢ్ 1.2 శాతం, తమిళనాడు లో 1.0 శాతం చొప్పున ఉన్నాయి.