Telangana Vehicular Population | తెలంగాణలో పదేళ్లలో 148 శాతం పెరిగిన వాహనాలు

తెలంగాణ రాష్ట్రంలో Telangana Vehicular Population వేగంగా పెరుగుతున్నది. 2014తో పోల్చితే 2025నాటికి 148శాతం పెరుగుదల కనిపిస్తున్నది.

  • By: TAAZ |    telangana |    Published on : Sep 10, 2025 7:30 PM IST
Telangana Vehicular Population | తెలంగాణలో పదేళ్లలో 148 శాతం పెరిగిన వాహనాలు

Telangana Vehicular Population | తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2014తో పోల్చితే 2025 నాటికి వాహనాల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగిందని ఆర్టీఏ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి రిజిస్టర్డ్‌ వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటిందని సమాచారం. వీటికి ఏటా సుమారు 9.3 లక్షల వాహనాలు జతచేరుతున్నాయి. వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతున్నదని గణాంకాలను గమనిస్తే అర్థమవుతున్నది. 2024 సంవత్సరంలో 25,986 ప్రమాదాలు చోటు చేసుకోగా.. అందులో సుమారు 7,949 మరణాలు చోటు చేసుకున్నాయి. 23వేల మందికిపైగా గాయపడ్డారు. జాతీయ లెక్కలను బట్టి రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో, మరణాల సంఖ్యలో పదో స్థానంలో తెలంగాణ నిలిచింది. 2025 జూలై నాటి వరకూ లెక్కలను గమనిస్తే మరణాల సంఖ్య మునుపటి ఏడాదికంటే గణనీయంగా తగ్గిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం మొదలైందనేందుకు ఇదొక సంకేతంగా భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి, రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్‌ జస్టిష్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల డాటా, తీసుకుంటున్న చర్యలు, ప్రజలను చైతన్య పర్చే కార్యక్రమాలు, రోడ్డు భద్రతపై సమయానుకూలంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్రీకరించారు.

తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా క్రమంగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు భద్రత, కఠినమైన నిబంధనలు, బాధ్యతాయుత డ్రైవింగ్‌ సంస్కృతి పెరిగేలా చర్యలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నాయకత్వంలో అన్ని విభాగాల సమన్వయంతో రోడ్డు భద్రతను ప్రాధాన్య అంశంగా తీసుకున్నామని వివరించారు.

కీలక చర్యలు

  • పిల్లల్లో ట్రాఫిక్‌ అవగాహన కల్పించే పార్కులు : 2025 జనవరిలో తొలి పార్క్‌ను ప్రారంభించారు. 2026 నాటికి ప్రతి జిల్లాలో ఒక పార్క్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది.
  • రోడ్డు భద్రతపై పాఠ్యాంశం : ఏఐ ఆధారిత లర్నింగ్‌ మాడ్యూల్స్‌ అభివృద్ధి దశలో ఉన్నాయి. రోడ్ సేఫ్టీ క్లబ్స్‌ ఏర్పాటు చేయడంలో పాఠశాలలకు ప్రోత్సాహం.
  • రోడ్‌ సేఫ్టీ క్లబ్స్‌ : రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఇప్పటికే 57 క్లబ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • అవగాహన కార్యక్రమాలు : కొత్త వాహనదారులకు, లైసెన్స్‌ హోల్డర్లకు రోడ్డు భద్రతా సందేశాలతో కూడిన కరపత్రాల అందజేత.
    నగదు రహిత చికిత్స పథకం : రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో చికిత్సకు 1.5 లక్షల కవరేజీ కల్పిస్తారు.
  • ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ : అతివేగంతో వాహనాలను నడిపేవారిని, రాంగ్‌వేలో డ్రైవ్‌ చేసేవారిని, ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు, ఏఐ ఆధారిత వ్యవస్థల ఏర్పాటు.
  • రోడ్డు భద్రత నిధి : అవగాహన, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మెడికల్‌ క్యాంపులు, శిక్షణ నిమిత్తం వాహనాలపై కొత్త సెస్‌ విధింపు.

ఇతర చర్యలు

రహదారులపై బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి, వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో సరిచేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకి షేర్‌ చేస్తున్నామని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి డ్రైవ్‌ చేసేవారిని గుర్తించేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆరు నెలల్లోపు ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జస్టిస్‌ సప్రే హర్శించారు. అయితే.. వేగవంతమైన, గణనీయమైన ఫలితాల కోసం మరింత శ్రమించాలని కోరారు.

ఆయన చేసిన సూచనలు

  • జిల్లా స్థాయి భద్రతా కమిటీల సమావేశాలను ప్రతి నెలా ఏర్పాటు చేయాలి.
  • రోడ్లపై గుంతలు, బ్లాక్‌స్పాట్స్‌ను వెంటనే సరిచేయాలి.
  • రాష్ట్రంలోని మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయాలి.
  • లైసెన్స్‌ లేదా బీమా కాలపరిమితి ముగిసే ముందు వాహన యజమానులకు ఆటోమెటిక్‌ సందేశాలు పంపే ఏర్పాటు చేయాలి.
  • అన్ని విభాగాలు కలిసికట్టుగా ఈ కృషిలో భాగస్వాములై రోడ్డు భద్రతలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.