తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ .. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది.

విధాత, హైదరాబాద్ : : టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ నెలలో ఒకసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నారు. ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు.
గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు.