Cell Phones Ban For RTC Drivers : ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు డ్యూటీలో సెల్ ఫోన్లు నిషేధం
తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు డ్యూటీలో సెల్‌ఫోన్లు నిషేధం. దశలవారీగా అన్ని డిపోల్లో నిబంధనలు అమలులోకి వస్తాయి.

Cell Phones Ban For RTC Drivers | విధాత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్ డ్రైవర్ల విధులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండకూడదని ఉత్తర్వులు జారీచేసింది, ఈ కొత్త నిబంధనలు ఈరోజు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా పేర్కొంది. డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహా ప్రమాదాల నివారణకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండకూడదని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముందుగా కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, ఫలితాల మేరకు దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేస్తారు. డ్రైవరు విధుల్లో చేరేముందు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి, డిపోలోని సెక్యూరిటీ అధికారి (కార్యాలయం) వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విధులు ముగించుకునే వెళ్లే ముందు తిరిగి తీసుకోవాలి. ఇంటి నుంచి కానీ, అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్‌కు సమాచారం అందించడానికి డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్ నంబరును అందుబాటులో పెడతారు. ఆ నంబరుకు కాల్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్‌తో మాట్లాడిస్తారు. తొలి దశలో ఫరూక్‌నగర్ (హైదరాబాద్), కూకట్‌పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), పరకాల (వరంగల్) డిపోలలో సెల్ ఫోన్ నిషేధం నిబంధనలు అమలవుతాయి.