Calcutta trainee doctor murder | కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం దారుణం.. జూడాల ఆందోళనకు సంఘీభావం తెలిపిన మంత్రి సీతక్క

Calcutta trainee doctor murder |  కోల్‌కతాలో మహిళ వైద్యురాలి హత్యాచారం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క పేర్కోన్నారు.

Calcutta trainee doctor murder | కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం దారుణం.. జూడాల ఆందోళనకు సంఘీభావం తెలిపిన మంత్రి సీతక్క

Calcutta trainee doctor murder |  కోల్‌కతాలో మహిళ వైద్యురాలి హత్యాచారం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క పేర్కోన్నారు. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఒక రోజు ఓపి బంద్ నిర్వహించారు. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో పీజీ వైద్యులు విధులు బహిష్కరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టిన జూనియర్‌ డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కోల్‌కత్తా ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలన్నారు. మహిళా దేవతతో సమానమని,ఇప్పుడిప్పుడే మహిళలు బయటకి వస్తున్నారని, ఇలాంటి ఘటనలు సమాజాన్ని మధ్య యుగాలకు తీసుకువెళ్తుందన్నారు. తరగతి గదుల నుంచే మహిళలను గౌరవించాలి అని నేర్పిస్తామన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదని, మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. మహిళా భద్రత పై ప్రతి ఒక్కరి ఆలోచన మారాలని,అందుకోసం కృషి చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే మహిళా భద్రత పై కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని, కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు ఇలాంటివి జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తామని, వైద్యుల భద్రత మనందరి బాధ్యతని, బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా న్యాయం జరగాల్సిందేనన్నారు. పని ప్రదేశాల్లో భద్రత చాలా ముఖ్యమని, దాని కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

ఏపీలోనూ జూనియర్ డాక్టర్ల నిరసన

కోలకతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు నిలిపివేశారు.
మంగళగిరి ఎయిమ్స్ జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఓపీ సేవలను బహిష్కరించారు. విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నుంచి రామవరప్పాడు కూడలి మీదుగా ఈఎస్ఐ ఆసుపత్రి వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. తమను వృత్తి పరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కోల్‌కతాలో జరిగిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీ ఉద్యమం చేస్తామన్నారు.