రెండేళ్ల క్రితమే ప్రతిష్టాత్మక పథకాలను బందుపెట్టిన బీఆరెస్.. నివేదికలో వెల్లడించిన కాగ్

బీఆరెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పథకాలన్నింటినీ రెండేడ్ల కిందటే బంద్ చేసిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. దళిత బందు, మూసీ ప్రక్షాళన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, హైదరాబాద్ విశ్వ

రెండేళ్ల క్రితమే ప్రతిష్టాత్మక పథకాలను బందుపెట్టిన బీఆరెస్.. నివేదికలో వెల్లడించిన కాగ్

దళిత బందుకు కేటాయించిన సొమ్ములు ఖర్చు చేయలే
విశ్వనగరానికి మొండి చేయి
పేరుకు రూ. 50 వేల కోట్లు- ఖర్చు నిల్
ఆరోగ్యంపై ప్రభుత్వ నిధుల తగ్గింపు- పెరిగిన ప్రజల ఖర్చు
టెస్ట్ చేయకుండానే మందుల సరఫరా
నాసిరకం మందుల సరఫరా
పల్లె దావఖానాల్లో అందుబాటులో లేని డాక్టర్లు
అసలును మించిన మిత్తి చెల్లింపులు
అధ్వానపు ఆర్థిక నిర్వహణ
బీఆరెస్ పాలనలో అప్పుల పాలైన తెలంగాణ

విధాత: బీఆరెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పథకాలన్నింటినీ రెండేడ్ల కిందటే బంద్ చేసిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. దళిత బందు, మూసీ ప్రక్షాళన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, హైదరాబాద్ విశ్వనగరం ప్రాజెక్ట్ లకు కేటాయించిన డబ్బులును ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. మూసీ ప్రక్షాళనకు 2020-21 నుంచి వరుసగా మూడేళ్లు అప్పటి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. కానీ ఖర్చు చేయలేదు.

ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పిన దళితబంధు పథకం కింద రూ.15,700 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. రైతుల మేలుకు వ్యవసాయ రంగానికి భారీగా ఖర్చు చేస్తున్నామని చెప్పి ఏటా కేటాయించిన మొత్తం కంటే రూ.4 వేల కోట్లు తక్కువ ఖర్చుపెట్టింది. హైదరాబాద్‌ ను విశ్వనగరం చేస్తామని 2020-21 నుంచి ఐదేండ్లలో రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2020-21 బడ్జెట్‌లో మూసీ ప్రక్షాళన, మూసీ పరీవాహక ప్రాంత పథకం, ఇతర పథకాల పేరిట రూ.10వేల కోట్లు ప్రతిపాదించింది. 2021-22లో రూ.2,600 కోట్లు, 2022-23లో రూ.200 కోట్లు కేటాయించినా ఖర్చుకాలేదు. పాతబస్తీకి మెట్రో మార్గానికి రూ.500 కోట్లు, విమానాశ్రయ మెట్రోమార్గానికి రూ.378 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభమవకపోవడంతో ఈమొత్తాన్ని ఉపసంహరించుకొంది.

డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.11000 కోట్లు కేటాయించి అరకొరగా ఖర్చు చేసింది. గొర్రెల పంపిణీ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి ఒక్కపైసా ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అన్నింటిదీ ఇదే పరిస్థితి అని కాగ్ తెలిపింది.

హరితహారం మొక్కల పెంపకానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.35 కోట్ల హరిత నిధి విరాళాలను వసూలు చేసిన ప్రభుత్వం కేవలం రూ.15 కోట్లు ఖర్చు చూపించింది. మిగతా నిధులను ఏమి చేశారని విషయాన్ని కాగ్ ప్రశ్నించింది.

ఆరోగ్యంపై కేటాయింపులు తగ్గించిన బీఆరెస్ సర్కారు

జాతీయ ఆరోగ్య విధానం(ఎన్‌హెచ్‌పీ) 2017 ప్రకారం మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయింపులు 8 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. రాష్ట్రంలో కేటాయింపులు అందులో సగం కంటే తక్కువ ఉన్నాయని కాగ్ తెలిపింది. 2016-17 నుంచి 2021-22 వరకు ఆరోగ్య రంగానికి 2.53శాతం నుంచి 3.47శాతం వరకు మాత్రమే కేటాయింపులు ఉన్నాయని చెప్పింది . ఎన్‌హెచ్‌పీ 2025 నాటికి ఆరోగ్య రంగంపై వ్యయం జీఎస్డీపీ లో 1.15శాతం ఉండాలని, ప్రస్తుతం తెలంగాణలో ఒక్క శాతం కంటే తక్కువగా ఉందని కాగ్ ప్రస్తావించింది.

ఆరోగ్యంపై పెరిగిన తెలంగాణ ప్రజల ఖర్చు

తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు తమ ఆరోగ్యంపై స్వంతంగా పెడుతున్న ఖర్చు జాతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉందదని కాగ్ తెలిపింది. ప్రజలు ఆరోగ్యంపై పెడుతున్న ఖర్చు జాతీయ సగటు 13 శాతం ఉంటే.. తెలంగాణలో 14.4శాతం ఉందని తెలిపింది. 2030 నాటికిదీన్ని 7.83 శాతానికి తగ్గించాలనేది లక్ష్యంగా ఉండాలని తెలిపింది.

బీఆర్‌‌ఎస్ సర్కార్ హయాంలో మెడిసిన్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని కాగ్ వెల్లడించింది. 2016 నుంచి 2022 వరకు కొనుగోలు చేసిన మెడిసిన్‌‌లో సుమారు రూ.390.26 కోట్ల విలువైన మందులు పేషెంట్లకు అందకుండానే ఎక్స్పైరీ అయ్యాయని చెప్పింది.

సుమారు 54 బ్యాచ్‌‌ల మెడిసిన్‌‌ను టెస్టింగ్ చేయించకుండానే హాస్పిటళ్లకు సప్లై చేశారని కాగ్ తెలిపింది. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిలో 84 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్టు టెస్టింగ్ ల్యాబ్స్ తేల్చాయని వెల్లడించింది.

రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్‌ పరిధిలో 56 శాతం ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో 48శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో 46 శాతం ఖాళీలున్నాయి. వైద్య కళాశాలల్లోనూ బోధనా సిబ్బంది కొరత ఉంది. 122 పల్లె దవాఖానాల్లో వైద్యాధికారులే అందుబాటులో లేరు.బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కకు మించిన అప్పులు చేసింది. గడిచిన పదేండ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పటి అప్పులు, వడ్డీలు కట్టేందుకు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతోంది. 2022–23 సంవత్సరానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదకలతో ఈ విషయం మరోసారి బట్టబయలైంది. బీఆరెస్ ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్షన్నర కోట్లు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉందని కాగ్ తెలిపింది. ఒక ఏడాదిలో చేసిన రూ.1,02,453 కోట్ల అప్పులకు రూ.1,64,565 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉందని కాగ్ ప్రస్తావించింది. గత ప్రభుత్వం అనుసరించిన ఆధ్వాన్నపు ఆర్థిక నిర్వహణ తీరుతో అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి పదేండ్లలో అంటే 2023–24 నుంచి 2032–33 వరకు రూ.2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పింది. ఈ మేరకు ఏ సంవత్సరం ఎంత చెల్లించాల్సి ఉందో స్పష్టం చేస్తూ ఒక టేబుల్ ను ప్రచురించింది. ఇలా ఇప్పటి వరకు చేసిన అప్పులకు వడ్డీలు, అసలు కింద చెల్లింపులే బడ్జెట్ లో ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

బడ్జెట్ లో చూపించకుండా కార్పొరేషన్ల పేరిట చేసిన బడ్జెటేతర రుణాల వివరాలను గత ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే.. ఆ వివరాలన్నీ తప్పనిసరిగా బడ్జెట్‌లో చూపాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కాగ్‌ వెల్లడించింది.
అప్పులు తెచ్చి అప్పులు కడుతున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులతో సంపద చేకూర్చే అవసరాలకు ఖర్చు చేయాలి. కానీ పాత అప్పులు, వడ్డీలకు తెచ్చిన అప్పులను ఖర్చు చేయటంతో మూలధన వ్యయం తగ్గిపోయిందని కాగ్ చెప్పింది.

కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, మిషన్ భగీరథ, వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ల పేరు మీదనే 90 శాతం పైగా అప్పులు చేసిందని కాగ్ తెలిపింది.
15వ ఫెనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు రాష్ట్ర జీఎస్డీపీలో 29.7 శాతం మించకూడదు. కానీ.. 2022–23 నాటికే అది 35.64 శాతానికి చేరుకున్నదని చెప్పింది.
రాష్ట్ర జీఎస్ టీ చెల్లింపుల ద్వారా రావాల్సిన రూ.986 కోట్ల ఆదాయం అవకతవకలతో కోల్పోయిందని కాగ్ వేలెత్తి చూపింది. 2017-22 మధ్య అయిదేండ్లలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని పలు ఉదాహరణలను ప్రస్తావించింది. పన్ను ఎగవేయటం, కొన్నికేసుల్లో తక్కువ పన్ను చెల్లించటం, కొన్నింటికీ జరిమానాలు వసూలు చేయకుండా ఈ అక్రమాలకు పాల్పడ్డారని కాగ్ తన నివేదికలో తెలిపింది.