Kaleswaram | కాళేశ్వరం కమిటీ విచారణ వేగవంతం.. త్వరలోనే కీలక వ్యక్తులకు నోటీసులు
కాళేశ్వరం బ్యారేజీ.. లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు నగరంలోనే మకాం వేయనున్నారు.

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజీ.. లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు నగరంలోనే మకాం వేయనున్నారు. ఈ కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా, మరో రెండు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగియనున్నది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. శనివారం జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ విచారణలో భాగంగా హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ ఎదుట హాజరై పలు అంశాలపై వివరణ ఇచ్చారు. కమిషన్ విచారణ అనంతరం బయటకు వచ్చిన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..”కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చాను. తెలంగాణ భవిష్యత్తు కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేశారని, తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ మదిలో ఉండేదని, కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని వివరించారు. స్టోరేజీ లేకపోవడం వల్ల తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదని, సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164టీఎంసీల్లో 64టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉందన్నారు. వార్ధా నది బ్యారేజీ రూ.2,500కోట్లతో నిర్మాణం అవుతుందని, తుమ్మిడిహట్టికి రూ.7,500ఖర్చు అవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశామని, ‘వి’ ఆకారంలో బ్యారేజీ కట్టడం సాధ్యం కాదు కాబట్టే కట్టలేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 54టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించానని తెలిపారు.. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, నేను కమిషన్ ముందు చెప్పిన వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అన్నారని, ఈనెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతానని ప్రకాశ్ చెప్పారు.
అఫిడవిట్‌ల పరిశీలన పిదప నోటీస్‌లు
అఫిడవిట్ల ఆధారంగా తదుపరి విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెడీ అయింది. అయితే ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నాతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్ వారి వద్ద నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. అయితే ఓ మాజీ సీఎస్ మినహా మిగతా అందరూ కమిషన్కు తమ వాదనలను అఫిడవిట్ల రూపంలో సమర్పించారు. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా వారు సమర్పించిన వివరాలన్నింటినీ కమిషన్ పూర్తి స్థాయిలో విశ్లేషిస్తోంది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో గత ప్రభుత్వ పెద్దలకూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సాంకేతిక అంశాలపై కసరత్తు దాదాపు పూర్తి చేసిన కమిషన్ ఇక ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.