కన్న కొడుకే కాలయముడు … వీడిన షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసు మిస్టరీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

కన్న కొడుకే కాలయముడు … వీడిన షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసు మిస్టరీ

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మూడో భార్యకు ఆస్తి మొత్తం రాసిస్తాడనే అనుమానంతోనే బాడీగార్డ్‌ బాబాకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేల్చారు. ఈ మేరకు కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కమ్మరి కృష్ణ తన మొదటి భార్య, ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మరణించిన తర్వాత మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య పావనికి 16 నెలల కుమార్తె ఉంది. ఆమె పేరు మీద దాదాపు 16 కోట్ల విలువజేసే ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించాడు. దీనిపై కృష్ణతో మొదటి భార్య పెద్ద కొడుకు గొడవపెట్టుకున్నాడు. కృష్ణను ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తాన్ని పావనికే రాసిచ్చేస్తాడని అతనిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా కృష్ణను చంపాలని ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలోనే కృష్ణ దగ్గర పనిచేసే బాడీగార్డ్‌ బాబాకు రూ.25 లక్షల నగదు, ఒక ఇల్లు ఇస్తానని ఆశచూపాడు.
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు జీలకర్ర గణేశ్‌ అలియాస్‌ లడ్డూ, ఇంకొక వ్యక్తితో కలిసి కమ్మదనం ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. జీలకర్ర గణేశ్‌, మైనర్‌ బాలుడు ఇద్దరు కలిసి కమ్మరి కృష్ణ చేతులు వెనక్కి పట్టుకోగా.. బాబా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, పొట్టలో పొడిచి పరారయ్యాడు. అతని అరుపులు విని పైఅంతస్తులో ఉన్న భార్య వచ్చి కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. మృతుడి కృష్ణకు 100కోట్ల మేరకు ఆస్తులున్నాయి. మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు. మూడవ భార్య కూతురి పుట్టిన రోజు వేడుకలను నాలుగు నెలల క్రితమే జరిపించాడు.