Phone tapping case | ప్రభాకర్‌రావు అరెస్టుకు రంగం సిద్ధం .. దొరకని శ్రవణ్‌రావు ఆచూకీ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

  • By: Subbu |    telangana |    Published on : Jul 20, 2024 3:25 PM IST
Phone tapping case | ప్రభాకర్‌రావు అరెస్టుకు రంగం సిద్ధం .. దొరకని శ్రవణ్‌రావు ఆచూకీ

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్ రావు, ఏ-6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభాకర్ రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు, శ్రవణ్‌రావు ఎక్కడున్నారన్న సమాచారాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాజాగా నాంపల్లి కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, శ్రవణారావుపై రెడ్ కార్నర్‌ నోటీసులు జారీ చేసినా అతడి ఆచూకీ దొరకడం లేదు. దీంతో దర్యాప్తు అధికారులు విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.