TGSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. ఐదు, పది రూపాయాల తగ్గింపు ఛార్జీలతో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు జూన్ 1 నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మార్చి నుంచి మే చివరి వరకు కల్పించిన ప్రత్యేక రాయితీ పథకం నేటితో ముగియనుంది. ఇక జూన్ 1 నుంచి పాత ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
జూన్ 1 నుంచి ఛార్జీలు ఇలా..
మెట్రో డీలక్స్ బస్సుల్లో ఇక నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 30 టికెట్ విధించనున్నారు. అలాగే ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో రూ. 35 వసూలు చేయనున్నారు.
ప్రత్యేక రాయితీ పథకం కింద ఇలా..
మెట్రో డీలక్స్ బస్సులో గతంలో నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 టికెట్ ఉండగా, ప్రత్యేక రాయితీ పథకం కింద దాన్ని రూ.25కు తగ్గించారు. ఇక ఈ-మెట్రో ఏసీ సర్వీసులో కనీస ఛార్జీ రూ.35 ఉండగా ప్రత్యేక రాయితీ పథకం కింద రూ.25కి తగ్గించారు.
ఛార్జీల పెంపు లేదు..
అయితే ఈ మార్పుపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక ముఖ్యమైన స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా అందించిన సమ్మర్ డిస్కౌంట్ గడువు మాత్రమే ముగిసిందని పేర్కొంది. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సంస్థకు సహకరించాలని అధికారులు కోరారు.
