రాష్ట్ర ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ప్రధాన పార్టీలు, నేతల్లో టెన్షన్ టెన్షన్
కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ మధ్యే పోటీగెలుపోటములపై అభ్యర్థుల్లో ఆందోళన నేటి తీర్పుతో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం

విధాత ప్రత్యేక ప్రతినిధి:ఎన్నికల ఫలితాల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలు, నేతల్లో తీవ్రమైన టెన్షన్ కనిపిస్తోంది. పోటీ చేసిన అభ్యర్థులు గెలుపోటముల పై ఆందోళనతో ఉన్నారు. దేశంలో ఓటరు తీర్పు ఎలా? ఉంటుంది? ఏ పార్టీకి పట్టం కడుతారనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ వైపు ఓటరు మొగ్గు చూపారో తేలనున్నది. పోలింగ్ ముగిసిన చాలా రోజుల తర్వాత ఫలితాలు వెలువడనున్నందున అందరికీ ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు దేశ, రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం కనబరుస్తాయని భావిస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీలు మంగళవారం నాటి కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యేందుకు తమ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను సిద్ధం చేశారు. లెక్కింపు సందర్భంలో అప్రమత్తంగా ఉండాలంటూ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ నాయకులు, అభ్యర్థులు ఈ పనిలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ పార్టీ, అభ్యర్థి పరిస్థితి ఏంటనే విషయం పై ప్రాథమిక అంచనాలతో ఉన్నారు. వారి అంచనాలకు తగిన విధంగా ఫలితాలొస్తాయా? లేదా నేడు తేలనున్నది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల
ఎన్నికలపై ఎవరికి వారు పార్టీలు, అభ్యర్థుల అంచనాలుండగా శనివారం ఎగ్జిట్ పోల్ ఫలితాలను సర్వే సంస్థలు ప్రకటించాయి. దీంతో తమ సొంత అంచనాలను, ఎగ్జట్ పోల్ అంచనాలను అభ్యర్థులు సరిపోల్చుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లుగా ఉంది. బీఆరెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఫలితాలు నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ సందర్భంలో ఓటింగ్ సరళి, ఓటరు స్పందన ఎలా ఉందనే సాధారణ అంచనాకు వచ్చినప్పటికీ నిజమైన తీర్పు పై అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ప్రధాన పార్టీలకు పరీక్షా ఫలితాలు
రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు ఎన్నికల పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలో బీఆరెస్, దేశంలో బీజేపీ పదేళ్ళు అధికారంలో ఉన్నందున నెలకొన్న ప్రజావ్యతిరేకతతో పాటు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఓటరు ఏ విధంగా స్పందించారో ఈ ఎన్నికల్లో తేలనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటరు తీర్పు తమ ఐదునెలల పాలనకు రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా మూడు పార్టీలు నువ్వానేనా అనే స్థాయి పోటీపడినప్పటికీ పోలింగ్ నాటికి పరిస్థితుల్లో మార్పు జరిగినట్లు భావిస్తున్నారు. త్రిముఖ పోటీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొని బీఆరెస్ ఓట్లు క్రాస్ కావడంతో ఈ పరిణామం ఏ పార్టీకి అనుకూలంగా? ఏ పార్టీకి ప్రతికూలంగా జరిగిందనే దిశగా రాజకీయ విశ్లేషణ సాగుతోంది. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా రుజువు పరుస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతుండగా బీఆరెస్ పార్టీ నారాజవుతున్నది. కాంగ్రెస్ ను కొంత కలవరపరుస్తున్నాయి.
రాష్ట్రంపైన కాంగ్రెస్ భారీ ఆశలు
ఆరునెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఓటర్లపై మరిన్ని ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ పార్టీకి అనుకూల ఫలితాలొస్తాయని ఆశ పెట్టుకున్నది. డబుల్ డిజిట్ సభ్యులు గెలుస్తారనే అంచనాతో ఉన్నారు. ఒక వైపు బీజేపీ, మరో వైపు బీఆరెస్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రచారం సాగించినప్పటికీ తమకు సానుకూల ఫలితాలొస్తాయని విశ్వసిస్తున్నారు. గతంలో రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలుండగా ఈ ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు 10 నుంచి 12 స్థానాలొస్తాయని చెబుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ స్థాయి ఫలితాలివ్వడంలేదు. ఇదిలాఉండగా బీఆరెస్ ఓట్లు భారీగా బీజేపీకి క్రాస్ అయినట్లు చర్చ జరుగుతున్నది. దీంతో పాటు ఐదునెలల కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా రెండు పార్టీలు తీవ్రమైన దాడి చేయడం వల్ల కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో మోదీ రావాలనే అభిప్రాయంతో కూడా కొంత ఓటు బ్యాంకుకు గండిపడినట్లు చెబుతున్నారు. పైకి గాంభీర్యాన్ని కనబరుస్తున్నా లోపల మాత్రం కాంగ్రెస్ లో సైతం ఆందోళన ఉన్నట్లు చెబుతున్నారు. ఎంత కాదన్నా ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే బీఆరెస్ తో సమస్యలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు బీజేపీ బలం పెరిగితే తమ అధికారానికి కంటిలో నలుసుగా మారనున్నది.
బీఆరెస్‌కు అగ్ని పరీక్ష
గతంలో ఎన్నడూలేని విధంగా బీఆరెస్ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది. నిన్నటి వరకు రాష్ట్రంలో హవా సాగించి, తొమ్మిది మంది ఎంపీలతో ఉన్న బీఆరెస్ పరిస్థితి ఇప్పుడు నిరాశాజనకంగా ఉందనే ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఆ పార్టీకి మరింత ఇబ్బందులు తప్పేట్లు లేవు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఏమైనా సానుభూతి పెరిగిందా? పరిస్థితుల్లో మార్పు జరిగిందా? అనేది తేలనున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదేండ్ల తర్వాత తొలిసారి క్షేత్రస్థాయిలో రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లక్ష్యంగా తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఉన్న బలాబలాలనేపథ్యంలో ఏ విధమైన ప్రభావం కనబరిచిందనేది ఫలితాలు తేల్చనున్నాయి. కాంగ్రెస్, బీజీపీ కంటే తమ పార్టీకీ అనుకూలంగా ఓటరున్నారని ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితి విరుద్ధంగా ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్ రిజల్టు నిజమైతే బీఆరెస్ పార్టీకి రానున్న రోజుల్లో కష్టాలుతప్పవంటున్నారు. ఆ పార్టీ నాయకులు, కేడర్ ను కాపాడుకోవడం కష్టంగా మారనున్నది.
బీజేపీ నేతల్లో ఎగ్జిట్ పోల్స్ ఉషారు
బీజేపీ సైతం తమ పదేండ్ల పాలనకంటే తమ ప్రచారం పైన్నే విశ్వాసంతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో మూడు స్థానాలకు పరిమితమైతే ఈసారి 8 నుంచి 10 స్థానాల్లో గెలుస్తామనే ధీమా కనబరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీలో ఉషారెత్తించాయి. రాముడు, మోదీ, అమిషాల ప్రచారంపై ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకంటే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలొస్తాయని ఆశిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీలొస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం కనబరిచే అవకాశం ఉంది.