రాష్ట్రంలో రేవంత్ బాబా.. డజన్ దొంగల పాలన … కానరాని ప్రజాపాలన,ప్రజాదర్బార్ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా రేవంత్ బాబా..డజన్ దొంగల మాదిరిగా సాగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా రేవంత్ బాబా..డజన్ దొంగల మాదిరిగా సాగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల పేరుతో చీకటి ఒప్పందాలు చేస్తూ జవాబుదారీతనం, పారదర్శకత లేని అవినీతి ప్రభుత్వం నడుస్తుందని విమర్శలు చేశారు. ప్రజా దర్బార్ కనబడకుండా పోయిందని, ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ బాబా ఆధ్వర్యంలో 12 మంది దొంగల పాలన కొనసాగుతుందని, అన్ని వ్యవస్థలలో బీ, ఆర్, యూ టాక్స్‌ల అవినీతి సాగుతుందని ఆరోపించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. గ్లోబల్ టెండర్లలో 40 శాతం లెస్‌కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను రాజీనామాకు సిద్ధమని తెలిపారు. మెఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు 1270కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారన్నారు. అమృత్ నిధులు గ్లోబల్ టెండర్లు లేకుండా ఇచ్చారని, ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30 శాతం తక్కువకు చేసేందుకు చాలా కంపెనీలు ముందుకి వస్తాయని తెలిసారు. ఇందులో 12 వందల కోట్ల కుంభకోణం జరిగిందని, మీ అవినీతిని బట్టబయలు చేసి ప్రజ క్షేత్రంలో నిలబెడతామని, గ్లోబల్ టెండర్లు రద్దు చేయకుంటే మా పార్టీ పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరించారు. అలాగే కవిత లిక్కర్ కేసులో మీ బామ్మర్ది మీ సృజన్ లేరా? అని రేవంత్ రెడ్డిని ఏలేటి ప్రశ్నించారు. మీ అవినీతిని వదిలే ప్రసక్తే లేదని, ఈ అవినీతి టెండర్లు రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని, ప్రస్తుత టెండర్లు రద్దు చేస్తే 12 వందల కోట్లు రాష్ట్ర ఖాజానికి మిగులుతాయని తెలిపారు. బీజేఎల్పీ సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని, మరో రెండు రోజుల్లో బీజేఎల్పీ మరొక్కసారి సమావేశం అవుతుందని, ఇన్ని రోజులు నేను చేసిన ఆరోపణలన్నింటి మీద బీజేఎల్పీలో చర్చించి పోరాటానికి సిద్ధం అవుతామని ఏలేటి స్పష్టం చేశారు.