తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు జూపల్లి, వివేక్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోతున్న ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహెట్టి ప్రాజెక్టు ను శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామిలు సందర్శించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వల్ల గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తాం. అది కూడా ఒక్క యూనిట్ కరెంటు వినియోగించకుండా నీటిని గ్రావిటీ ద్వారా తీసుకువెళ్తాం అని జూపల్లి తెలిపారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోతున్న ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహెట్టి ప్రాజెక్టు ను శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామిలు సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. డా. బీఆర్. అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ( తుమ్మిడిహెట్టి బరాజ్) కు అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో భూమిపూజ చేశారు. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అని గుర్తు చేశారు. 106 కిలోమీటర్ల విస్తీర్ణంలో కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ చేశారు. 46 కిలోమీటర్ల కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేశారు అని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షలు కోట్లు వృథా చేసింది. దీంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగిందని జూపల్లి విమర్శించారు. గ్రావిటీ ద్వారా మళ్లించాల్సిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడం వల్ల అంచనా వ్యయం పెరగడంతో ఆర్ధిక భారం కూడా పెరిగిందన్నారు.

తలాపున నదీ జలాలు ఉన్న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రైతన్నలకు మేలు జరగకపోవడంతో అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతాం. భూములు నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు.

ఈ నెల 10 న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో బీజేపీ ప్రజా ప్రతినిధులు ఈ ప్రాజెక్ట్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని జూపల్లి కోరారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోవడంతో ఇప్పుడు ఆ జలాల్ని వినియోగించుకునే అవకాశం లేదు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వల్ల గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తాం. అది కూడా ఒక్క యూనిట్ కరెంటు వినియోగించకుండా నీటిని గ్రావిటీ ద్వారా తీసుకువెళ్తాం అని జూపల్లి తెలిపారు.

మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ. తెలంగాణలోని 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి దగ్గర సీఎంగా వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నీ పక్కనపెట్టి, కమీషన్ల కోసం కేసీఆర్ మేఘ కృష్ణ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించి దోచుకున్నారని ఆరోపించారు. కానీ ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత రైతులకు సాగు త్రాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ పునః ప్రారంభానికి శ్రీకరం చుట్టారని చెప్పుకొచ్చారు.

Latest News