పల్లాకే జనగామ టికెట్.. ముత్తిరెడ్డికి నిరాశే

  • Publish Date - October 10, 2023 / 11:16 AM IST
  • నకిరేకల్‌లో దిగొచ్చిన నేతి


విధాత : జనగామ నియోజకవర్గం బీఆరెస్ పార్టీ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తున్నామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి పనిచేసి పల్లా గెలుపుకు కృషి చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం పల్లా రాజేశ్వర్ రెడ్డిని, సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, వారి అనుచరులను హైద్రాబాద్‌కు పిలిపించుకున్న మంత్రి కేటీఆర్ వారితో సమావేశమయ్యారు.


రాజేశ్వర్‌రెడ్డికి, ముత్తిరెడ్డికి మధ్య సయోధ్య కుదిర్చారు. పల్లాకే పార్టీ టికెట్ కేటాయించామని ఆయను గెలిపించాలని కోరారు. సయోధ్యలో భాగంగా ఇప్పటికే ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి కేటాయించారు. జనగామసిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చి రాజేశ్వర్‌రెడ్డితో, స్టేషన్ ఘనపూర్ సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతుసమన్వయ సమితి చైర్మన్ పదవిని కట్టబెట్టి కడియం శ్రీహరితో సయోధ్య కుదిర్చారు.


కాగా.. ఆ రెండు నియోజకవర్గాల్లో సిటింగ్‌ల అసమ్మతిని చల్లార్చి టికెట్లు దక్కిన పల్లా, కడియంలతో రాజీ కుదర్చడం ద్వారా ఆ నియోజకవర్గాల్లో అసమ్మతిని సర్ధుబాటు చేయడంలో కేటీఆర్‌ సఫలీకృతమయ్యారు. అయితే టికెట్ దక్కని సిటింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఎంతమేరకు పల్లాకు, కడియంకు సహరికరిస్తారన్నది ఎన్నికల్లోనే తేలనుంది.


నకిరేకల్‌లో నేతి-లింగయ్యల మధ్య సయోధ్య


నకిరేకల్ నియోజకవర్గంలో బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వ్యతిరేకిస్తున్న మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను కేటీఆర్ బుజ్జగించారు. విద్యాసాగర్ నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వేముల వీరేశంకు మద్దతునిస్తున్నారు. దీంతో విద్యాసాగర్‌ను, లింగయ్యలను మంత్రి కేటీఆర్ హైద్రాబాద్‌కు పిలిపించుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరు కలిసి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలని సూచించారు. ఈ చర్చలలో మంత్రి జి.జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీత, గాదరి కిషోర్‌, శానంపూడి సైదిరెడ్డిలు ఉన్నారు.