Mutyala Ravinder | వికసిత్ భారత్‌లో విద్యకు ప్రాధాన్యం లేదా?.. టీపీటీఎఫ్ నేత ముత్యాల రవీందర్
48.25 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యా రంగానికి 1.25 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ప్రశ్నించారు

హైదరాబాద్: 48.25 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యా రంగానికి 1.25 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ప్రశ్నించారు. గత ఏడాది 1.12 లక్షల కోట్లు కాగా, మొత్తం బడ్జెట్‌లో ఇది 2.59 శాతం మాత్రమేనని తెలిపారు. బడ్జెట్లో కనీసం 6 శాతం కూడా కేటాయించకుండా ఈ నామమాత్రపు నిధులు విద్యా అభివృద్ధికి తోడ్పాటును అందించలేదన్నది ఆయన తేల్చి చెప్పారు.
విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి, కొత్త ఉపాధ్యాయులను నియమించడానికి, నాణ్యమైన మధ్యాహ్న భోజనం నిర్వహణల కోసం ఇంత తక్కువ నిధులయితో వికాసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన నిలదీశారు. ఈ నామమాత్రపు కేటాయింపులతో పేద వర్గాలకు విద్యను అందించాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నట్లు అర్థమవుతోందని ముత్యాతల రవీందర్ విమర్శించారు.
వేతన జీవులను మోసం చేసిన బడ్జెట్
ఆదాయపు పన్ను ప్రతిపాదనలు లెక్కల గారడీ చేస్తూ పన్ను భారాన్ని పెంచుతూ వేతన జీవులను మోసం చేస్తున్నాయని ముత్యాల రవీందర్ అన్నారు. గతేడాది కొత్త పాలనలో 7 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తింపజేయగా, నేటి బడ్జెట్‌లో ఆ మినహాయింపును కూడా తొలగించి స్టాండర్డ్ డిడక్షన్‌ను 75 వేలకు పెంచి ఉద్యోగులను మోసం చేశారని, ఇది అస్సలు ఓదార్పునివ్వదని స్పష్టం చేశారు.