సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధితో పాటు సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధితో పాటు సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం బోనాల పండుగకు, సోమవారం రంగం కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈ రూట్లలో వెళ్లకండి.. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి..
కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పారడైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
ఈ నాలుగు రోడ్లు మూసివేత
టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్‌కు వచ్చే రోడ్
బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు
జనరల్ బజార్ రోడ్
ఆదయ్య ఎక్స్ రోడ్
వాహనాల మళ్లింపు మార్గాలు ఇవే..
– సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
– సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను బేగంపేట నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.
– బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లించనున్నారు.
– ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యారడైస్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
– ప్యారడైస్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పారడైస్ మీదుగా మళ్లించనున్నారు.
– హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్ వరకే అనుమతించనున్నారు. మళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
బోనాల జాతరకు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఇవే..
హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, ఆదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్.