తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందేనని..ఇందుకోసం తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒకఎకరా భూమి ఇచ్చేందుకు ‘భూలక్ష్మి’ పథకం అమలు చేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం ‘భూలక్ష్మి’ అని ఆమె పేర్కొన్నారు.
భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం అని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి భూమి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్‌గా మారిపోయిందని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా మూడు వేల ఎకరాల భూమిని పేదలకు ఇచ్చారని.. ఆ తర్వాత ఆపేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధీనంలోని, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడం సాధ్యమేనని చెప్పుకొచ్చారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.22ఏ జాబితా ముసుగులో రేవంత్ సర్కార్ భూ దోపిడికి వేసుకున్న రాచబాట అని ఆరోపించారు. అంతకుముందు ధరణి..లో ఇప్పుడు భూభారతిలు భూ దోపిడి స్కీమ్ లుగా మారాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి – పదేపదే గతంలో జరిగిన విషయాలనే ప్రస్తావిస్తూ.. చేయాల్సిన పనులను పక్కన పెట్టకూడదని కవిత హితవు పలికారు.
మాటల్లోనే కాంగ్రెస్ సామాజిక న్యాయం..
బీసీలకు పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా.. ఆచరణలో మాత్రం సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని కవిత ప్రశ్నించారు. రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే 56 శాతం ఉన్న బీసీల కోసం ఖర్చు చేసింది 0.999 శాతం మాత్రమేనని.. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సామాజిక న్యాయం? అని కవిత ప్రశ్నించారు. విజయశాంతి లాంటి ఉద్యమకారులను పక్కన పెట్టి.. మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని కవిత ప్రస్తావించారు. ప్రభుత్వం నియమించిన అడ్వైజర్ల జీతాల విషయంలోనే సామాజిక న్యాయం ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం.. కానీ ఆచరణలో మాత్రం ఆటవికా న్యాయమా..? అని ప్రశ్నించారు.
మహిళలకు రెండు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి స్వయంగా మీనాక్షి నటరాజన్ ను ఓడించిన సంగతి మరువరాదన్నారు. బీసీ, మహిళా మంత్రులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవమానాలు ఎదురవుతున్నాయని, లాంబాడా మంత్రి పదవి లేని కేబినెట్ రేవంత్ సర్కార్ అని కవిత విమర్శించారు. కాంగ్రెస్ లో పార్టీని ప్రశ్నిస్తే అగ్రవర్ణాలకు ఓ న్యాయం..బీసీ,ఎస్సీ, ఎస్టీ నాయకులు మాట్లాడితే మరో న్యాయం అమలు చేస్తున్నారని కవిత ఆరోపించారు.
