దసరా పండుగకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకుంటున్నారా..? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీరు రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్‌ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయడమే.
రాఖీ పండుగకు లక్కీ డ్రా నిర్వహించి, ప్రయాణికులకు బహుమతులు అందజేసిన మాదిరిగానే.. దసరాకు కూడా బహుమతులు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. రాఖీ పండుగకు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించిన ఆర్టీసీ యాజమాన్యం, ఈసారి పురుషులకు కూడా అవకాశం కల్పించింది. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల మధ్య టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాకు అర్హులే అని ప్రకటించారు.
ఈ లక్కీ డ్రాలో ఎంపికైన ప్రయాణికులకు రూ. 11 లక్షల నగదు బహుమతులు అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి రీజియన్ నుంచి ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. ఇందుకు చేయాల్సిందల్లా ఒక్కటే.. అదేంటంటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసి డ్రాప్ బాక్సుల్లో వేయడమే అని యాజమాన్యం తెలిపింది.
పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.