TTD | భక్తులారా.. హైదరాబాద్‌లో టీటీడీ బ్రహ్మోత్సవాలు.. వివరాలివే
TTD | తిరుమల( Tirumala ) శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమల వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్( Hyderabad ) నగరంలో కూడా తిలకించొచ్చు. అందుకు హిమాయత్‌నగర్( Himayat Nagar )లోని టీటీడీ( TTD ) ఆలయం వేదిక కానుంది. వివరాలు ఇవే..

TTD | హైదరాబాద్ : తిరుమల( Tirumala ) శ్రీవారి బ్రహ్మోత్సవాలను కళ్లారా చూసి తీరాల్సిందే అని చాలా మంది భక్తులు( Devotees ) అనుకుంటారు. ఆ దేవ దేవుడు.. తిరు వీధుల్లో విహరిస్తూ ఉండగా.. చూడాలనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అలాంటి భక్తులు బాధపడాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను మన హైదరాబాద్( Hyderabad ) నగరంలో కూడా తిలకించొచ్చు. అందుకు హిమాయత్‌నగర్( Himayat Nagar )లోని టీటీడీ( TTD ) ఆలయం వేదిక కానుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ వెల్లడించారు.
హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) శ్రీ వేంకటేశ్వర స్వామి( Sri Venkateshwara Swamy ) ఆలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 3 నుంచి 7 వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 2న అంకురార్పణంతో ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
జూన్ 3న ఉదయం 6.30 నుండి 8.45 గంటల మధ్య పవిత్రమైన మిధున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ధ్వజారోహణం తర్వాత, శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు జరగనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహించనున్నారు. జూన్ 4న ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు ఉంటుంది అని రమేష్ వెల్లడించారు.
జూన్ 5న ఉదయం 10 గంటలకు గజ వాహనంపై దేవుడి ఊరేగింపు ఉంటుందని, సాయంత్రం 8 గంటలకు గరుడ వాహనం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. జూన్ 6న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహన సేవ జరగనుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగినన్న రోజులు భక్తులకు ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదం పంపిణీ చేయబడుతుందని ఆయన తెలిపారు.