CM REVANTH REDDY | ధరణి స్థానంలో.. కొత్త రెవెన్యూ యాక్ట్..! సర్కార్ మదిలో క్లారిటీ.. కలెక్టర్లకు కీలక నిర్దేశాలు
ధరణికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించింది సర్కార్. ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ యాక్ట్‌ను తెచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ కొత్త చట్టమే మేలని సర్కార్ భావిస్తోంది.

ధరణి స్థానంలో.. కొత్త రెవెన్యూ యాక్ట్..!
సర్కార్ మదిలో క్లారిటీ.. కలెక్టర్లకు కీలక నిర్దేశాలు
భూ సమస్యల శాశ్వత పరిష్కారాల దిశగా సర్కార్ అడుగులు..
రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి కాన్ఫరెన్సు..
ఇక ప్రజాపాలన ముద్ర..! పథకాల అమలుకు శ్రీకారం..
ఇప్పటి వరకు పథకాలపై లేని సర్కార్ మార్క్..
రైతుభరోసా, రుణమాఫీపై కలెక్టర్లకు దిశానిర్ధేశం..
రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల పెంపుపై క్లారిటీ..
ధరణి పెండింగ్ సమస్యలు, పరిష్కారాలపై చర్చ..
కాన్ఫరెన్సు అనంతరం స్పీడందుకోనున్న పాలన..
విధాత, హైదరాబాద్: ధరణికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించింది సర్కార్. ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ యాక్ట్‌ను తెచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ కొత్త చట్టమే మేలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే దీనిపై అపార అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇతర మేథావులతో చర్చించిన పిమ్మట ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త చట్టానికి చట్టబద్ధత కూడా కల్పించాలని ప్రభుత్వం క్లారిటీతో ఉంది. దీన్నే ప్రాధామ్య అంశంగా తీసుకుని రేపు (మంగళవారం) నిర్వహించబోయే కలెక్టర్ల కాన్ఫరెన్సులో కీలక ఆదేశాలు, దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులపై చర్చించనున్నారు.
పథకాలపై నజర్..
ఇక పరిపాలనపై నజర్ పెట్టింది సర్కార్. ఇప్పటి వరకు సాగిన పరిపాలనపై కాంగ్రెస్ సర్కార్ ముద్రలేదు. కొత్త ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై పూర్తిగా దృష్టి సారించలేదు. పార్లమెంటు ఎన్నికలు, రాజకీయ సమీకరణలు.. తదితర అంశాలకే ప్రయార్టీ ఇచ్చిన నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలులో సర్కార్ ముద్ర పడలేదు. ఇప్పటి వరకు అమలవుతూ వస్తున్న సంక్షేమ పథకాలన్నీ గత ప్రభుత్వంలోనివే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, పేదల గృహావసరాలకు ఉచిత కరెంటు మినహా ఇతర హామీలు అమలు రూపం దాల్చలేదు. దీనికి తోడు పంద్రాగస్టులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ కాన్ఫరెన్సు ప్రాధాన్యతను సంతరించుకున్నది. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, ఆఫీసులకే పరిమితమవుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా పరిపాలనను పరిగెత్తించే పనిలో భాగంగా ప్రాధామ్య అంశాలపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ధరణిలో చాలా వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటి పరిష్కరాలపై చర్చించనున్నారు.
ఇక ప్రజాపాలనకు నాంది…
ఇప్పటి వరకు జిల్లాల వారీగా పరిపాలన గాడిలో పడలేదు. ప్రభుత్వం ఏర్పడగానే ఎంపీ ఎన్నికలు రావడంతో పూర్తిగా పరిపాలనపై పట్టు నిలుపుకోలేకపోయింది సర్కార్. కలెక్టర్ల పరిస్థితి కూడా అంతే. మహిళలకు ఫ్రీ బస్సు, కరెంటు ఫ్రీ, సబ్సిడీ సిలిండర్.. మినహా ప్రజాపాలనపై కొత్త ప్రభుత్వం మార్కు ఇంకా పడలేదు. ప్రధానంగా ప్రభుత్వం ముందున్న సవాలు.. రైతు భరోసా. వానాకాలం సీజన్ ఆరంభమైంది. రైతులకు పెట్టుబడి సాయం కావాలె. కానీ ప్రభుత్వం దీనికి ఓ స్లాబ్‌ను నిర్ణయించనుంది. ఐదెకరాలకే పరిమితం చేసే పనిలో పడింది. అభిప్రాయసేకరణ పేరుతో జాప్యం చేస్తుంది తప్ప ఇతమిత్థంగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. నాన్చుడి దోరణి మాని వెంటనే ఓ స్పష్టతతో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
రుణమాఫీపై కలెక్టర్లకు క్లారిటీ..
పంద్రాగస్టులో లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పలుమార్లు ప్రకటించారు. మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ దీనికి విధించిన నిబంధనలు రైతులందరికీ ఆమోద యోగ్యంగా లేదు. రెండు లక్షల రుణమాఫీ విడతల వారీగా చేస్తారా..? ఒకేసారి చేస్తారా..? క్లారిటీ లేదు. ఒకేసారి చేయడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వం చేసిన విడతల వారీ రుణమాఫీతోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్ష రుపాయల రుణమాఫీని వందశాతం పూర్తిగా చేయలేకపోయింది కేసీఆర్ సర్కార్. మరి రేవంత్ సర్కార్ తనకు తానుగా ఓ డెడ్‌లైన్ విధించుకున్నది. ఈ విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన సందర్భం ఇది. కాన్ఫరెన్సులో దీనిపైనా లోతైన చర్చ జరగనుంది.
పైలట్ ప్రాజెక్టుగానే పథకాలు..
ఆసరా పెన్షన్ల పెంపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకునేలా లేదు సర్కార్. పాత పెన్షన్లనే ఇవ్వలేకపోతున్నది. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఇస్తామన్న 2, 500 పెన్షన్ కూడా ఇప్పట్లో తేల్చేలా లేదు. ఇందరిమ్మ ఇళ్ల పేరుతో ఐదు లక్షల ఆర్థిక సాయం పైలట్ ప్రాజెక్టుగా తీసుకునే అవకాశం ఉంది. ఇచ్చిన హామీలు బోలేడున్నాయి. ప్రతిపక్షాలకు ఇదే అంశం అస్త్రంగా మారకుండా ప్రతీ హామీని టచ్ చూస్తే పైలట్‌గా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీని కోసం కలెక్టర్లను సమాయత్తం చేయనుంది ప్రభుత్వం. సర్కార్ ఉద్దేశ్యాన్ని ఈ కాన్ఫరెన్సులో విడమర్చి చెప్పడం ద్వారా వారికి ఓ దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.