Minister Komatireddy | దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు.

Minister Komatireddy | దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

విధాత, హైదరాబాద్ :

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా బుధవారం ఆర్ అండ్ బీ, MoRTH, అధికారులకు, నిర్మాణ సంస్థకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గతుకుల రోడ్డు మార్గంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు ఉప్పల్ వరంగల్ మార్గంలో అధికారులు ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టారన్నారు. ఉప్పల్ వరంగల్ మార్గంలో ప్రయాణించే వారికి, మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామని అన్నారు. మొత్తం 5.5 కి.మీ గాను 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. బీటీ రోడ్డు పనులు, ఎలివేటెడ్ కారిడార్ పనులు పొద్దున, రాత్రి షిఫ్టుల వారిగా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం, రాజకీయాలకు అతీతంగా 2026 దసరా నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తామని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.