Minister komatireddy | హాలివుడ్ రేంజ్‌లో తెలంగాణ ఫిల్మ్ హబ్ : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణను హాలీవుడ్‌ స్థాయి ఫిల్మ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Minister komatireddy | హాలివుడ్ రేంజ్‌లో తెలంగాణ ఫిల్మ్ హబ్ : మంత్రి కోమటిరెడ్డి

విధాత, హదరాబాద్ :
తెలంగాణను హాలీవుడ్‌ స్థాయి ఫిల్మ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్‌ శెలార్‌ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్రాల మధ్య సినిమా పరిశ్రమ అభివృద్ధి, పాలసీ రూపకల్పన, సహకార కార్యక్రమాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రాచకొండ, వికారాబాద్‌ వంటి ప్రాంతాలు షూటింగ్‌లకు అనువుగా ఉన్నాయని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించిన రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ స్థాయి సినిమాలు తెరకెక్కుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను కూడా సినిమాల నిర్మాణానికి అనువైన వేదికలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు, పన్ను సడలింపులు, సినీ కార్మికుల సంక్షేమం వంటి పలు ప్రోత్సాహక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి కొమటి రెడ్డి వెల్లడించారు.

అనంతరం మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ శెలార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమైనవన్నారు. తాము కూడా మహారాష్ట్రలో అలాంటి పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా ఆయన, మహారాష్ట్ర ఫిల్మ్‌ సిటీని సందర్శించాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆహ్వానించారు.