పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్, డీజిల్,ఎల్పీజీ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్పీజీ కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజలు ఎవరూ కూడా గందరగోళంలో పడొద్దని ఆయన సూచించారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రానున్న మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ కు మించి సరఫరా కొనసాగుతోందని, ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా, 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు.

దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగినప్పటికి.. రోజువారీ సరఫరాలో సగటున పోల్చిచూసినపుడు కుడా ఎక్కడా అంతరాయం కలుగ కుండా అదనంగా 22% అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.

అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చెరుకోక పోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. వాస్తవంగా మాత్రం పెట్రోల్, డీజిల్ లకు ఎంత మాత్రం కొరత లేదని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో,డబ్బాలలో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని,సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని,హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ , బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యాయన్నారు. ఎల్పీజీ జి విషయంలో ఎటువంటి కొరత లేదని, కాకపోతే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు. ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Varanasi | ‘వారణాసి’తో గ్లోబల్ టార్గెట్ .. సెట్ ఫొటోలు చూసి అవాక్క‌వుతున్న సినీ ప్రియులు
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు