Sajjanar : నేరాలపై ఉక్కుపాదం..హైదరాబాద్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్
కొత్త సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో నేరాలపై ఉక్కుపాదం.. సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళల భద్రతపై కఠినంగా వ్యవహరిస్తారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ పోస్టు నుంచి హైదరాబాద్ సీపీగా బదిలీయైన సీనియర్ ఐపీఎస్ వీసీ.సజ్జనార్ సోమవారం తన కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్ హైదరాబాద్ సీపీగా నగరంలో
రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభుత్వ సహకారంతో పక్కా ప్రణాళికతో డ్రగ్స్ నిర్మూలన చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. కష్ట పడకుండా డబ్బులు రావాలని అనుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాయమాటలు నమ్మొద్దని, సైబర్ క్రైమ్ బారిన పడవద్ధని సూచించారు. నేరాలపై ప్రజలు కూడా బాధ్యతగా సమాచారం అందించాలని కోరారు.
ఇటీవల హైదరాబాద్ లో మహిళలపై హత్యాచారాల ఘటనలు పెరుగుతున్నాయన్న ప్రశ్నపై స్పందిస్తూ ఇలాంటి నేరాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతానన్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు ఎదురైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. బాధిత మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 100కు ఫోన్ చేయడం లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా మహిళలు రక్షణ పొందాలని సూచించారు.
తనకు నాన్ యూనిఫాం సర్వీస్ కొత్త కాదన్నారు. గతంలో ఇంటెలిజెన్స్, ఏసీబీ విభాగాల్లో పని చేశానన్నారు. తను ఏ విభాగంలో పని చేసినా స్పీడ్, స్టైల్ ఏ మాత్రం తగ్గదన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉద్యోగ బాధ్యతల నుంచి రిలీవైన సందర్భంగా నా స్టాప్ వచ్చేసింది! అంటూ సజ్జనార్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.