Bhatti Vikramarka | త్వరలోనే జాబ్ క్యాలెండర్.. యూనివర్సీటీలకు రూ. 500 కోట్లు : భట్టి విక్రమార్క
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతామన్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతామన్నారు. టీజీపీఎస్సీకి కావాల్సిన నిధులను, మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందించాం. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇది వరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి విక్రమార్క ఈ విషయాలను వెల్లడించారు.
నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్‌కు పునాది అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 పోస్టులతో ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాం. జులై 18న పరీక్షలు ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాసింది. వీసీలను నియమించకుండా ఇంచార్జి వీసీల నియామకంతో కాలం గడిపింది. దీంతో యూనివర్సిటీల్లో పాలన, విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. త్వరలోనే వీసీలను నియమిస్తాం. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకై రూ. 500 కోట్లు ప్రతిపాదిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. దీంట్లో రూ. 100 కోట్లు ఓయూకు, మరో రూ. 100 కోట్లు మహిళా యూనివర్సిటీలో మౌలిక వసతులకు ప్రతిపాదించామన్నారు. మిగతా రూ. 300 కోట్లు కేయూతో పాటు ఇతర యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తామన్నారు భట్టి విక్రమార్క.