Congress Party | కాంగ్రెస్‌లో కట్టలుతెగిన క్రమశిక్షణ.. కమిటీ ముందున్నా కట్టడిలేని నేతలు
Congress Party | కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీని, నేతలను ఈ అతి ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదికూడా క్రమశిక్షణను సైతం కాలదన్ని కట్టలుతెగినట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీడియా ముందు బహిరంగ ఆరోపణలు
పరకాల అభ్యర్ధినంటూ సుస్మిత పోస్టు
వరంగల్ నేతల పరస్పర విమర్శలు
బజారునపడ్డ నాయకుల పంచాయతీ
ముక్కున వేలేసుకుంటున్న శ్రేణులు
ఎన్నికల అఫిటవిట్‌పై కొత్త వివాదం
Congress Party | విధాత ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీని, నేతలను ఈ అతి ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదికూడా క్రమశిక్షణను సైతం కాలదన్ని కట్టలుతెగినట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం, ముఖ్యనేతలు అప్పుడప్పుడూ క్రమశిక్షణ పాటించాలంటూ ఉపదేశాలూ… ఉపోద్ఘాతాలిస్తారు! కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ గాంధీభవన్‌లో గొర్రెలతో నిరసన చేపట్టిన అంశంపై స్పందించి క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేదిలేదని హెచ్చరించినట్లూ… శనివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరంగల్ నాయకుల లొల్లిపై మాట్లాడుతూ క్రమశిక్షణ విస్మరిస్తే చర్యలు తపవన్నటూ గట్టిగా వార్నింగులిస్తారు. అవసరమైనపుడు మాత్రం దాన్ని పాటించరని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలాడుతకుంటున్నాయి.
పార్టీ ఒక్కటేగానీ.. నాయకులు వేరు. గ్రూపులూ.. వీధి పోరాటాలు.. సమావేశాల్లో రచ్చరచ్చ ఇదంతా ఆ పార్టీకి అలంకార ప్రాయమైన ఆభరణాలన్నట్టు పరిస్థితి తయారైంది. అధికారంలో ఉంటే అధికారం కోసం…. లేకుంటే ప్రతిపక్షంలో ప్రాధాన్యం కోసం నోటితో చేతలతో తన్నుకోవడం కామన్ అంశంగా మారిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వంత అధికారాన్ని కాపాడుకునేందుకూ… ఆధిపత్యం కోసం పంచాయతీ సాగుతున్నది. చాలా కాలంగా అంతర్గతంగా మసిలిపోయిన విభేదాలు ఇప్పుడు బజారునపడ్డాయి. ఈ రగడ రోజుకో మలుపు తీసుకుంటున్నది. ఎవరికి వారు అమితుమీకి సిద్ధం కావడం ఇందులో కొసమెరుపు.
బజారుకెక్కిన నాయకుల విభేదాలు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లాకు చెందిన స్టేషన్ ఘన్ పూర్, పరకాల ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలతో నిప్పురాజుకున్న విషయం విదితమే. దీనికి మంత్రి సురేఖ మరింత ఆజ్యంపొస్తూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కడియంపై విమర్శలు చేశారు. దీనిపై అంతే తీవ్రంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, ఎమ్మెల్సీ బస్వరాజుతో పాటు ఎమ్మెల్యేలు నాయిని, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌నాగరాజు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి సమావేశమై తీవ్రంగా ప్రతిస్పందించారు. కొండా దంపతుల తీరును సహించేదిలేదని, అన్నినియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ మీడియా ముందు విమర్శించారు. తదుపరి అధిష్ఠానానికి, పీసీసీకి, క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి, సురేఖల పై ఫిర్యాదు చేశారు. తాము కావాలో… కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలంటూ ఒకింత అల్టిమేటమ్ జారీ చేశారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ ఇద్దరు ఎమ్మెల్యేలతో విచారణ కమిటీ వేసింది. ఇంకా ఆ కమిటీ పని ప్రారంభించనేలేదు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అదేశాల మేరకు కొండా మురళిని విచారణకు పిలిచారు. శుక్రవారం భారీ కాన్వాయ్‌తో గాంధీభవన్‌కు వెళ్ళిన కొండా మురళి.. వారికి ఆరు పేజీల లేఖ అందించి, మీడియాతో మాట్లాడారు.
మరింత జటిలమైన సమస్య
గాంధీభవన్ సాక్షిగా కొండా మురళి మీడియాతో బాహటంగా మాట్లాడిన అంశాలు, క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖ లోని అంశాలు బహిర్గతమయ్యాయి. ఇవి వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. మొదట కడియం, రేవూరిపై బహిరంగంగా, బస్వరాజుపై పరోక్ష విమర్శలు చేసిన మురళి లేఖలో సీనియర్ కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్ రెడ్డిని, ప్రస్తుతం ఆయనతో వియ్యం పొందిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఎమ్మెల్యేలు నాయిని, గండ్ర, నాగరాజులపై ఆరోపణలు చేయడంతో సమస్య మరింత జటిలమైంది. పైగా క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇస్తే రాలేదని, తానంతట తాను వచ్చానంటూ చెప్పడంతో `క్రమశిక్షణ కమిటీ`ని సైతం పలుచన చేశారనే విమర్శ ప్రత్యర్ధివర్గం వ్యక్తం చేసింది. సురేందర్ రెడ్డి, పొంగులేటిలనుఈ వివాదంలోకి లాగడంపై ప్రత్యర్ధి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మరోసారి సమావేశమై మీడియా ముందు కొండా దంపతులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మార్చిన వైనం.. పరకాలలో ఓడిపోయిన అంశాలన్నీ బహిర్గతంచేశారు. స్వంత లాభం తప్ప పార్టీని పట్టించుకోలేదంటూ…ఏ పార్టీలో ఉంటే వారిని తిట్టడమే పనంటూ బస్వరాజు తదితరులు బరస్ట్ అయ్యారు. దీనికి ముందు నాయిని మీడియా ముందు కొండా మురళి అంటే భయం మరీ… బొంగేంకాదంటూ సెటైర్‌లు వేశారు. మొత్తంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పంచాయితీ బహిరంగమై బజారుకెక్కింది. ఇదిలా కొనసాగుతుండగా పరకాలలో తాను ఎమ్మెల్యే అభ్యర్ధినంటూ కొండా మురళి కూతురు సుస్మితా పటేల్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం మరో వివాదానికి దారితీసింది.
5వ తేదీ వరకు వేచిచూస్తాం
వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు వర్సెస్ కొండా దంపతుల మధ్య గొడవకు 5వ తేదీన పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. 4వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పర్యటన ఉన్నందున 5వతేదీన ఏ చర్య తీసుకుంటారోనని వేచిచూస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ, పీసీసీ క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉన్నప్పటికీ అన్ని విషయాలు బహిర్గతం కావడమే కాకుండా మీడియాకెక్కి పరస్పరం విమర్శలు చేసుకోవడంతో కాంగ్రెస్‌లో క్రమశిక్షణపై పరిశీలకులు సెటైర్లు వేసుకుంటున్నారు. ఒకరు విమర్శిస్తే ప్రతస్పందనగా మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కల్చరే ఇంతంటూ అధికారమిస్తే ఆగరంటూ కొందరు ఘాటుగానే మండిపడుతున్నారు.
ఎన్నికల అఫిడవిట్ పై కొత్త వివాదం
తూర్పులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మురళి మాట్లాడుతూ తనకు 500 ఎకరాల భూమి ఉందని, 16 ఎకరాలు అమ్మి మొన్నటి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు రూ.70కోట్లు ఖర్చుచేశానంటూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలను సూమోటోగా తీసుకుని సురేఖ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు ఉన్నాయని వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సురేఖ పొందుపరిచారని గుర్తు చేశారు. కొండా మురళి వ్యాఖ్యల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తానని పేర్కొన్నారు. అడ్డదారిలో వరంగల్ తూర్పు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండ సురేఖ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.