వాన నీళ్లూ, మురుగు నీళ్లతో మునిగిన ఓరుగల్లు
వరంగల్ ప్రజలకు వాన అంటేనే ‘కంప’రం పుడుతోంది. మురుగునీటితో కలిసిన వర్షపు నీరు నివాసప్రాంతాల్లోకి ప్రవహించడంతో దుర్గంధం భరించలేక అవస్థలు పడుతున్నారు.

- కంపుతో ప్రజల సహజీవనం
- డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
- ముందస్తు ప్రణాళికలు నిల్
- కోటలు దాటుతున్న హామీలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: వర్షకాలం వచ్చిందంటే ‘ది గ్రేటర్ వరంగల్’ నగరం వరదముంపు బారిన పడుతోంది. యేటా ఇది షరామాములుగా మారింది. రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు కోటలు దాటుతున్నా.. ఆచరణాత్మక అభివృద్ధి అంగుళం కూడా కదలడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వానాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలవాసులు, గుడిసెవాసులు, మురికివాడల్లో నివసించే వారు ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక భారీ, అతిభారీ వర్షాలు కురిసిన సందర్భంలో నగరం పూర్తిగా జల దిగ్బంధానికి గురవుతోంది. అభివృద్ధికి ప్రతీకగా అభివర్ణించే కాలనీలకు సైతం వరద ముంపు తప్పడంలేదు. ప్రతీ సంవత్సరం వేల ఇండ్లు నీట మునుగుతున్నాయి. నగర జనం ఆస్థి నష్టం చవిచూస్తున్నారు. వర్షాలు కురిసినపుడు చెబుతున్న మాటలకు తర్వాత ఎలాంటి ప్రణాళిక లేక పోవడంతో పరిస్థితిల్లో మార్పు కనిపించడం లేదు.
వరంగల్ ప్రజలకు వాన అంటేనే ‘కంప’రం పుడుతోంది. మురుగునీటితో కలిసిన వర్షపు నీరు నివాసప్రాంతాల్లోకి ప్రవహించడంతో దుర్గంధం భరించలేక అవస్థలు పడుతున్నారు. pic.twitter.com/rWlz9Padoy
— vidhaathanews (@vidhaathanews) August 13, 2025
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా దశ దిశ మారుతుందని ఆశించినా.. పరిస్థితిలో ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ను మరో డల్లాస్ చేస్తామని ఊదర గొట్టిన నాటి సీఎం కేసీఆర్.. తొమ్మిదిన్నరేళ్లలో డల్లాస్ కాదు కదా.. కనీసం డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయలేక పోయారనే ఆగ్రహం నగర వాసుల్లో ఉంది. వరంగల్ నగర ప్రజలకు వర్షాల నుంచి రక్షణ ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం జలమయమై ఆవే వాహనాలు రోడ్లపై తేలుతున్నాయి. ప్రధాన రోడ్లపైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు తిప్పే దృశ్యాలను నగర వాసులు అనుభవించారు.
మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం
రెండో రాజధానిగా చెప్పుకొనే వరంగల్.. అభివృద్ధిలో ఆ దిశగా పురోగతి సాధించడంలేదు. గ్రేటర్ వరంగల్ సిటీ దాదాపు 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 2.25 లక్షల ఇండ్లుండగా ఇందులో సుమారు 11 లక్షల జనాభా. దీనికి తోడు నిత్యం నగరానికి వచ్చిపోయేవారు వేలల్లోనే ఉంటారు. గ్రేటర్ వరంగల్‌లో చిన్నా,పెద్దా కలిసి 1,450 వరకు కాలనీలు ఉన్నాయి. ఇందులో 183 స్లమ్ ఏరియాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్ నగరం రోజురోజుకు జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోంది. విద్యా, వైద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో గ్రామాలనుంచి వలసలు పెరగడంతో ఇటీవల వరంగల్ నగర జనాభా పెరుగుతోంది.
వర్షం పడితే జనం బెంబేలు
వరంగల్ నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన డ్రైనేజీలు, 1,433.02 కిలోమీటర్ల మేర సాధారణ డ్రైన్లు, 51 కిలోమీటర్ల వరకు మీటర్ వెడల్పు బాక్సు డ్రైన్లు ఉన్నాయి. మొత్తం 882.21 కిలోమీటర్ల వరకు పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెబుతున్నప్పటికీ నగరంలో సగానికి పైగా కాలనీలు, ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థేలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా యేండ్ల క్రితం నిర్మించినది. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పొంతన లేకపోవడంతో కాలం చెల్లిన డ్రైనేజీలు ఇరుకుగా మారాయి. చిన్న వర్షం కురిసినా పొంగిపొర్లుతున్నాయి. వర్షం నీరు, మురుగు నీరు కలిసి జనాన్ని ముంచెత్తుతున్నాయి. యేటా ఇదో తంతుగా మారింది.
జల దిగ్భంధానికి పలు కారణాలు
నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న నగరం, కాలనీలు, అభివృద్ధి, జనాభాకుతగిన విధంగా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడం, నాలాలు ఆక్రమణకు గురికావడం, వర్షం నీరు, మురుగు నీటి పారుదలపై ప్రణాళిక లేక పోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఇక డ్రైనేజీల మధ్య సమన్వయం లేక పోవడంతో నీటిపారుదల వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారుతోంది. కురిసేవర్షానికి తగిన విధంగా నీటిపారుదల వ్యవస్థ, నీటి నిల్వా రిజర్వాయర్లు లేక పోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. వర్షం నీటిని ఒడిసిపట్టుకునే కార్యాచరణ కూడా లేదు. సగటు వర్షపాతంతో పాటు ఆకస్మికంగా భారీ వర్షాలు కురిస్తే నగరాలకు కనీస రక్షణ కల్పించే ముందుచూపు ప్రణాళికలు లేవంటున్నారు. ఉన్న చెరువులు, కుంటలు కబ్జాలపాలవుతున్నందున వరద ముంపు పెరుగుతోంది. వీటన్నింటికి తోడు కిందా, పైన కాంక్రీట్‌గా మారడంతో భూమిలోకి నీరింకే పరిస్థితి లేకుండా పోయింది. ఖమ్మం లాంటి నగరాలే ఇందుకు సాక్షి. వరంగల్ నగర వరద సమస్యకు ఒక పరిష్కారంగా అండర్ డ్రైనేజీ నిర్మాణం లేక పోవడం కారణమంటున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలైతే కొంత సమస్యకు పరిష్కారం లభించనున్నది.