ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన కొమరవెల్లి వీరన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న ఉత్సవాలు, మేడారం సమ్మక్క జాతరలకు భక్తులు పోటెత్తుతున్నారు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి

– కొమరవెల్లి, కొత్తకొండ, ఐలోని, మేడారం

– జాతరలకు పోటెత్తుతున్న భక్తులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన కొమరవెల్లి వీరన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న ఉత్సవాలు, మేడారం సమ్మక్క జాతరలకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతరల సందడితో ఓరుగల్లు హడావిడిగా మారింది. ప్రముఖ శైవ క్షేత్రాలుగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న, సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సెలవురోజు వస్తే మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. ఇంకా మేడారం జాతర నెల రోజులకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటినుంచే భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తున్నారు.

 

కొత్తకొండ, ఐలోనిలకు భారీగా భక్తులు

కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న ఉత్సవాలకు ఉదయం నుండే భక్తులు క్యూ లైన్ లలో ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో కొత్తకొండ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు కోడె మొక్కులను చెల్లించుకున్నారు. కొత్తకొండ, ఐలోని జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఎడ్లబండ్లలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కోరినకోర్కెలు నెరవేర్చే కోర మీసాల వీరభద్ర స్వామివారికి, మల్లన్నకు భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయంలో వీరభద్ర స్వామి, మల్లన్న నామస్మరణ మార్మోగింది. కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, మల్లన్న భక్తులు అభిషేకాలను నిర్వహించారు. ఆలయంలో ప్రసాదం, లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ప్రభాకర్

చారిత్రక పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, వొడితల ప్రణవ్ కుమార్ తో ఆలయానికి రాగా ఘనంగా స్వాగతం పలికారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని వారు దర్శించుకుని పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గుమ్మడికాయతో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. ఆలయంలోకి వెళ్లి వీరభద్ర స్వామికి అభిషేకం నిర్వహించారు. భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని మొక్కుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ ను ఆశీర్వదించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.

భక్తులకు అందుబాటులో సేవలు

కొత్తకొండ వీరభద్ర స్వామి ఉత్సవాల నేపథ్యంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లను చేశారు. దైవ దర్శనం కోసం భక్తులకు క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నిరంతరం వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాలను కల్పించారు. పారిశుధ్య నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యాన్నిఏర్పాటు చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులు ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహిస్తున్నారు. జాతర బందోబస్తులో పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు.