కలెక్టర్ల సదస్సుకు ముందు జిల్లా కలెక్టర్ల బదిలీలు?
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలిసారి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈనెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తున్నారు

21న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి
రైతు భరోసా, కౌలు రైతులకు అమలు, మహాలక్ష్మీ పథకం, కొత్త రేషన్ కార్డులు
సమావేశంలో కీలక అజెండా అంశాలివే!
కాన్ఫరెన్స్‌కు ముందే కలెక్టర్ల బదిలీలు?
కొట్టిపారేయలేమంటున్న అధికారులు
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలిసారి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా రైతు భరోసా, కౌలు రైతులకు అమలు, మహాలక్ష్మీ పథకం, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ల సదస్సుకు ముందు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తారా? తరువాత చేస్తారా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఎన్నికల కోడ్‌కు ముందు పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తరువాత కోడ్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
రెండున్నర నెలల్లో లోక్‌సభ నోటిఫికేషన్
మరో రెండున్నర నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అప్పటిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థులైన అధికారులను నియమించుకుని, పాలనను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సచివాలయంతో పాటు కొన్ని విభాగాలలో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఇంకా చేయాల్సిన బదిలీలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు పలు జిల్లాల్లో కొనసాగుతున్నారనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా తానతందాన అన్న ఎస్పీలను కూడా గుర్తించారని సమాచారం. వారి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ దృష్టి సారించి బదిలీ చేయాలనే ఒత్తిడి కాంగ్రెస్ నాయకుల నుంచి పెరుగుతోంది. ప్రభుత్వం మారినప్పటికీ ప్రస్తుతం ఉన్న కుర్చీలోనే కొనసాగించేందుకు తమవంతు ప్రయత్నాలను ఐఏఎస్, ఐపీఎస్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, ఉద్యోగరీత్యా వారు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని వివరణలు ఇచ్చుకుంటున్నారని తెలిసింది. మీరు కూడా ఉన్న సీట్లలో కొనసాగిస్తే చెప్పినట్లల్లా పనిచేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. బీఆరెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యం లేని సీట్లలో కాలం వెళ్లబుచ్చుతున్న అధికారులు తమకు ఈ ప్రభుత్వంలోనైనా కాస్త పనిచేసే సీటు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వేటు వేశారు. ఒంటెత్తు పోకడలతో తనే ప్రభుత్వం అనే విధంగా వ్యవహరించిన అరవింద్ పై వేటు వేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. అదే విధంగా మిగతా ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, అధికారులు కోరుతున్నారు.
కొత్త కలెక్టర్లు వస్తారా?
ఈ నెల 21న నిర్వహించే జిల్లా కలెక్టర్ల సదస్సుకు ఇప్పుడున్న వారినే ఆహ్వానిస్తారా? లేదా ఈలోపే కొత్తవారిని నియమిస్తారా? అన్న చర్చ నడుస్తున్నది. మరో మూడు రోజుల సమయం ఉన్నందున రేవంత్ రెడ్డి పలువురిని మార్చి కొత్తవారిని నియమించే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా సచివాలయంలో వినిపిస్తున్నది. పాతవారినే పిలిచి సమావేశం నిర్వహిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న వారిలో చాలా మంది బీఆరెస్‌కు అనుకూలంగా ఉన్నవారేనని సమాచారం. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కావాలన్నా, ప్రజల వద్దకు కాంగ్రెస్ ప్రభుత్వ ఫలాలు చేరాలన్నా జిల్లా కలెక్టర్లను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయి. మార్చకుండా సదస్సు నిర్వహిస్తే లాభం కన్నా నష్టం అధికమని పేర్కొంటున్నాయి. తమ ప్రభుత్వ నిర్ణయాలు, లక్ష్యాలు బీఆరెస్ పెద్దలకు చేరిపోతాయని కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండున్నర నెలల్లో పార్లమెంటు నోటిఫికేషన్!
పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండున్నర నెలల సమయం మాత్రమే ఉన్నందున జిల్లా కలెక్టర్ల సామూహిక బదిలీలు తప్ప మరో మార్గం ప్రభుత్వం ముందు లేదని వారు అంటున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నిర్ణయించుకున్నది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల వ్యవస్థ చాలా ముఖ్యం. ఈ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రెండు పథకాలతోపాటు అమలు చేయాల్సిన నాలుగు పథకాలపై చర్చించనున్నారు. అదే విధంగా అమలవుతున్న రెండు పథకాలపై లోటుపాట్లు, సవరించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా భూమి యజమానులు, కౌలు రైతులకు అందచేయాల్సిన సాయం ఎలా ఉండాలనేదానిపై ఒక నిర్ణయానికి రానున్నారు.