Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ‘చేతి’కి చిక్కేనా? మైనార్టీల మద్దతు ఎవరికి?

Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll ) అధికార కాంగ్రెస్‌( Congress )కు, ప్రతిపక్ష బీఆరెస్‌( BRS )కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు ద్వారా ప్రజలకు తమ సందేశాన్ని ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నాయి. ఇందు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ), బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఇద్దరూ చావో.. రేవో అన్నతీరుగా పని చేస్తున్నారు.

  • By: raj |    telangana |    Published on : Oct 31, 2025 6:30 AM IST
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ‘చేతి’కి చిక్కేనా? మైనార్టీల మద్దతు ఎవరికి?

Jubilee Hills By Poll | విధాత, హైదరాబాద్ ప్రతినిధి : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll ) అధికార కాంగ్రెస్‌( Congress )కు, ప్రతిపక్ష బీఆరెస్‌( BRS )కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు ద్వారా ప్రజలకు తమ సందేశాన్ని ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నాయి. ఇందు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ), బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఇద్దరూ చావో.. రేవో అన్నతీరుగా పని చేస్తున్నారు. కేసీఆర్( KCR ) ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం తో పాటు సానుభూతి సెంటిమెంట్‌ను రగిల్చి గెలుపొందేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసీ ఎంఐఎం మద్దతు కూడగ‌ట్టగలిగారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ( Minorities ) ప్రజల ఓట్లు 1.25 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ వర్గం మద్దతు కూడగట్టుకుంటే సునాయసంగా బయట పడవచ్చునని భావించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలను ఒప్పించి ప్రముఖ క్రికెట్ ఆటగాడు, మైనార్టీ వర్గానికి చెందిన‌ అజారుద్దీన్‌( Azharuddin )ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మైనార్టీ వర్గాలను పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రానా పూర్తి స్థాయిలో మైనార్టీలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఓట్లు వేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్ భవన్‌లో రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆహ్వాన లేఖ‌లు కూడా ముద్రించి మంత్రుల‌కు, ప‌లువురు ప్ర‌ముఖుల‌కు పంపిణీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నది. ఈ రెండేళ్లలో మాకు చేసిందేమిటన్న ప్రశ్న అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్నది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలే కొనసాగుతున్నాయి కానీ మాకు ప్రత్యేకంగా ఏమి చేశారని సగటు ఓటరు ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా మైనార్టీల నుంచి షాదీ ముబారక్ పాతదే.. రేషన్ బియ్యం పాతదే..పెన్షన్లు పాతవే.. కొత్తది ఏముందని అడుగుతున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఇది రేషన్ బియ్యం పథకమే కదా అని చెపుతున్నారు. ఈ రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోతగిన మార్క్ చూపించలేదన్న అభిప్రాయం జూబ్లీహిల్స్‌లో వ్యక్తం అవుతున్నది.

ఇటీవల మైనార్టీ ఓటర్ల నాడిని తెలుసుకోవడం కోసం నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 24 శాతం మాత్రమే మైనార్టీల మద్దతు ఉండగా, 46 శాతం బీఆరెస్‌కే మద్దతు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న ఎంఐఎంకు 13 శాతం మాత్రమే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్ నాడు నిర్ణయించుకునే వారి శాతం 14 శాతనికి పైగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ వీరి మద్దతు తీసుకోవడానికి ఏమి చేయాలా అన్న సమాలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగానే అజారుద్దీన్‌కు మంత్రి పదవి అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం బీఆరెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని బీఆరెస్ నాయకత్వం మొత్తం ఇక్కడే కేంద్రీకరించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలకు బూత్‌ల‌ వారీగా ఇంచార్జీలను నియమించారు. వీరంతా జూబ్లీహిల్స్‌లోనే మకాం వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ డివిజన్లకు ఇంచార్జీలుగా మంత్రులను నియమించింది. ఈ మంత్రులు ప్రచారం కన్నా స్టేట్ మెంట్లకు, మీటింగ్‌ల‌కే ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. ఇంటింటి ప్రచారానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల్లోకి చొచ్చుకు వెళతాడని స్థానికులు చెపుతున్నారు. అమ్మా.. అక్కా… అన్న… కాక అంటూ అందరిని ఆప్యాయంగా పలుకరిస్తాడని చెపుతున్నారు. నిత్యం ప్రజలతోనే ఉంటాడని చెపుతున్నారు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉందని చెపితే వెంటనే స్పందిస్తాడన్న పేరున్నది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ న్యాయవాది. ఇవన్నీ అతనికి కలిసి వచ్చే అంశాలుగా చెపుతున్నారు. వీటికి అదనంగా ఎంఐఎం మద్దతు కూడా ఉన్నది. కానీ తండ్రి శ్రీశైలం యాదవ్‌కు ఉన్న రౌడిషీటర్ ముద్ర నెగటీవ్ అంశంగా మారిందని అంటున్నారు. బీఆరెస్ నేతలు దీనినే ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు.

బీఆరెస్ అభ్యర్థి మాగంటి సునీత దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి. గోపీనాథ్ భార్యగా ఆమెపై ఉండే సానుభూతి మినహా ఏనాడు ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి కాదు.. పూర్తిగా పార్టీ బలంపైనే ఆధారపడి ఆమె గెలుపు ఆధారపడి ఉంటుందన్న చర్చ ప్రజల్లో జరుగుతున్నది. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ నామామాత్రమేనన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. దీంతో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు రెండు కూడా నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటర్ల మనన్నలు పొందేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.