రిజర్వేషన్లు, పునర్విభజన వేర్వేరు అంశాలు.. రెంటినీ కలపడంలో మోదీ కుట్ర : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా చట్ట సభల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ను రెండింటిని ఒక‌టిగా చూపించి ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నదని, ఈ రెండు అంశాలు ఒక‌దానికి ఒక‌టి సంబంధం లేనివి అని రేవంత్ రెడ్డి వివరించారు.

విధాత, హైదరాబాద్:

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌నను క‌ల‌ప‌డంలో రాజ‌కీయ కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2026 జనాభా లెక్క‌ల ప్ర‌కారం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకువ‌స్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు క‌ట్టుబ‌డి ఉంటామని అన్నారు. మ‌హిళల రాజ‌కీయ సాధికారిత‌కు కాంగ్రెస్ మొద‌టి నుంచి క‌ట్టుబ‌డి ఉందని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల పునర్వ‌భ‌జ‌నను ప్ర‌ధాని నరేంద్ర మోదీ రాజ‌కీయ పావుగా ప్ర‌మాద‌క‌రంగా వాడుకుంటున్నాడని సీఎం రేవంత్‌ విమర్శించారు. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మూడు సార్లు జ‌రిగిందని, 1967 లో 520 సీట్ల‌కు, 1976లో 542 సీట్లకు, ఆ త‌ర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543కి చేరుకుందని ఆయన అన్నారు. రిజర్వేషన్లు, పునర్విభజనలో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ కారణంతోనే ఇందిరాగాంధీ సీట్ల పెంపుపై నిషేధం

ద‌క్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్ర‌ణ ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌ జ‌నాభా త‌గ్గిందని, ఉత్త‌రాదిలో కుటుంబ నియంత్ర‌ణ అమ‌లు కాక‌పోవ‌డంతో జ‌నాభా విప‌రీతంగా పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ ఈ విష‌యాన్ని గ‌మ‌నించి లోక్ స‌భ సీట్ల ప్ర‌కార‌మే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారని తెలిపారు. 25 ఏళ్ల వ‌ర‌కు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారన్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గొద్ద‌నే సీట్ల‌ను నియంత్రించారని చెప్పారు. 2001లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి పున‌ర్విభ‌జ‌న పైన చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారని, దాని వ‌ల్ల‌ 2009లో తెలంగాణ‌కు 17 ఎంపీ సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వ‌చ్చాయని తెలిపాఉ. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఆంధ్రా కు 175 శాస‌న‌స‌భ సీట్లు పెరిగాయని గర్తు చేశారు.

2026 వ‌ర‌కు చ‌ట్ట‌ప‌రంగా సీట్ల పెంపు పైన నిషేధం విధించారని రేవంత్‌ చెప్పారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పున‌ర్విభ‌జ‌నకు ఒప్పుకోబోమ‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు నిర‌స‌న తెల‌ప‌డంతో పాటు ప్ర‌ధానికి లేఖ రాశాయని చెప్పారు. తాము ఒప్పుకోమ‌ని చెప్ప‌డంతోనే దామాషా ప్ర‌కారం యాభై శాతం సీట్లు పెంచుతామ‌ని అంటున్నారని అన్నారు. 20 సీట్లు ఉన్న కేర‌ళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంత‌రం ప్ర‌స్తుతం 60 సీట్లు మాత్ర‌మేనని, కానీ యాభై శాతం పెంచితే 90 సీట్ల‌కు వ్యత్యాసంతో పాటు అంత‌రం బాగా పెరుగుతుందని రేవంత్‌ రెడ్డి వివరించారు. తెలంగాణ‌కు, యూపీకి 94 సీట్ల అంత‌రం పెరుగుతుందన్నారు. ద‌క్షిణాదిలో 130 సీట్లు ఉన్నాయని.. యాభై శాతం పెరిగితే 195 అవుతాయని చెప్పారు. 413 సీట్లు ఉత్త‌రాదిలో ఉంటే.. వీటిని పెంచినప్పుడు 621 సీట్లకు చేరుకుంటాయని తెలిపారు. అప్పుడు ద‌క్షిణాది, ఉత్త‌రాది మ‌ధ్య అంత‌రం 412 నుంచి 620 సీట్లకు పెరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

రాజ‌కీయ అవ‌స‌రాల కోసం యాభై శాతం సీట్లు అంటున్నారని, భారతదేశ మ‌నుగ‌డ‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇది రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించిన‌ది కాదని, ప్ర‌జ‌ల‌కు సంబంధించిందని చెప్పారు. ద‌క్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజ‌ధానులు.. ఉత్త‌రాది రాష్ట్రాలు రాజ‌కీయ రాజ‌ధానులుగా మారాయన్నారు. ప‌న్నులు క‌ట్ట‌డం, స‌లామ్ చేయ‌డానికి తాము వ్య‌తిరేకమని అన్నారు.

జీ.ఎస్.డీ.పీ ప్రకారమే పునర్విభజన చేయాలి

సీట్ల పున‌ర్విభ‌జ‌న పైన హైబ్రీడ్ మోడ‌ల్‌ను తాను ప్ర‌పోజ్ చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. పెంచాల‌నుకుంటున్న 272 సీట్ల‌లో 136 సీట్లు ప్రొరేటా ప్ర‌కారం 136 సీట్లు జీ.ఎస్.డీ.పీ ప్ర‌కారం పున‌ర్విభ‌జ‌న చేయాలని డిమాండ్ చేశారు. స్థూల ఉత్ప‌త్తిలో అత్య‌ధికంగా భాగ‌స్వామ్యం చేస్తున్న రాష్ట్రాల‌కు అవ‌కాశం ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జ‌నాభా ప్రాతిపాదిక‌న సీట్లు లేవు అన్నారు. 100 శాతం జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పెంపు జ‌ర‌గ‌లేదు.. ప్రాతినిధ్యం కోస‌మే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారన్నారు. భార‌త‌దేశానికి ఆదాయాన్ని, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు దక్షిణాది రాష్ట్రాలు క‌ల్పిస్తున్నాయన్నారు. మ‌మ్మ‌ల్ని ఎలా శిక్షిస్తారు.. ? విద్యా, ఉద్యోగ అవ‌కాశాల్లో యాభై శాతం రిజ‌ర్వేష‌న్లు, యాభై శాతం మెరిట్ తో చేయాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిందన్నారు. అందుకే రిజ‌ర్వేష‌న్లు యాభై శాతానికి మించ‌లేదన్నారు. సీట్ల పున‌ర్విజ‌భ‌న పైన అఖిల పక్ష స‌మావేశంతో పాటు అన్ని సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు చేయాలని కేంద్రాన్ని కోరారు. పార్ల‌మెంటులో పున‌ర్విభ‌జ‌న పైన చ‌ర్చించి, నిపుణ‌ల‌తో ఒక క‌మిటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని అసెంబ్లీల్లో చ‌ర్చ‌కు పెట్టి పార్ల‌మెంటులో ఆమోదించి నిర్ణ‌యం తీసుకోవాలన్నారు. బాగా ప‌నిచేస్తున్న రాష్ట్రాల‌ను శిక్షించ‌వ‌ద్దని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

చిన్న రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తాం

ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని, పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మ‌హిళ‌ల‌ను చిన్న చూపు చూడ‌ట‌మే బీజేపీ ల‌క్ష‌ణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళ‌ల‌ను చూస్తున్నారని ఆయన దెప్పి పొడిచారు. స్వాతంత్ర్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్య‌త కూడా కాంగ్రెస్ దే అని సమర్థించుకున్నారు.

ప్రతిపక్షాలపై అనవసర రాద్ధాంతం

కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా చట్ట సభల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ను రెండింటిని ఒక‌టిగా చూపించి ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నదని, ఈ రెండు అంశాలు ఒక‌దానికి ఒక‌టి సంబంధం లేనివి అని రేవంత్ రెడ్డి వివరించారు. రెండింటిని విడ‌దీసి వేరు వేరుగా చ‌ర్చించి అమ‌లు పైన విధివిధానాల‌పైన నేను ఒక సూచ‌న చేస్తున్నాను అన్నారు. రాజ్యాంగంలోనే పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని, అప్ప‌టికి ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు లేదన్నారు. దేశ ప్ర‌ధానిగా, రాష్ట్ర‌ప‌తి గా, లోక్ స‌భ స్పీక‌ర్ గా, ముఖ్య‌మంత్రులుగా, గ‌వ‌ర్న‌ర్లు గా చాలా రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ అవ‌కాశం క‌ల్పించిందన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు తీసుకురాగా, సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చారు.. అప్పుడు రాజ్య‌స‌భ లో ఆమోదించారన్నారు. అప్పుడు బీజేపీ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే లోక్ స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదం పొంద‌లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ఇంత కాలం ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లును ప‌ట్టించుకోలేదన్నారు. 2026 జ‌నాభా లెక్క‌లు పూర్తి చేసి అమ‌లు చేయ‌కుండా 2011 జ‌నాభా లెక్క‌ల ఆధారంగా చ‌ట్టం ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. 2026 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం నిబంధ‌న‌ను స‌వ‌రించుకుంటే 2029 లోక్ స‌భ‌తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.

Latest News