మీరేమైనా రాజులా.. కొడుకును సీఎం చేసేందుకే: సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ గర్జన

మీరేమైనా రాజులా.. కొడుకును సీఎం చేసేందుకే: సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ గర్జన
  • మీరేమైనా రాజులా….
  • కొడుకును సీఎం చేసేందుకు..
  • సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ గర్జన
  • కేసీఆర్ అవినీతి చెప్పినందుకే నాకు దూరం
  • కాంగ్రెస్ బీఆరెస్‌లు ఒక్కటే
  • కర్నాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆరెస్ నిధులు

విధాత : తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుందని, ఒక కుటుంబమే తెలంగాణను కబ్జా చేసిందని, ప్రజాస్వామ్యాన్ని లూఠీ స్వామ్యంగా మార్చారని ప్రధాని నరేంద్రమోడీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ 8021కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ ఫ్లాంట్‌ను జాతీకి అంకితం చేశారు. అనంతరం ఇందూర్ ప్రజాగర్జన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ తీరుపై, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ నేను వంద శాతం నిజాలు చెప్పేందుకు ఇందూర్‌కు వచ్చానంటూ సీఎం కేసీఆర్‌కు తనకు ఉన్న వైరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ బీఆరెస్‌తో పొత్తు పెట్టుకోవాలని, తాను కూడా ఎన్డీఏలో చేరుతానని చెప్పారన్నారు.



తాను బీఆరెస్‌తో పొత్తును నిరాకరించానని మోడీ తెలిపారు, మళ్లీ ఎన్నికల తర్వాతా కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వచ్చి నన్నూ కలిశారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48సీట్లు గెలువగా, మేయర్ పదవి బీజేపీకి ఇస్తామని, ఎన్డీఏలో చేరుతానని చెప్పారన్నారు. నేను అలసిపోయానని, రాష్ట్రానికి ఎంతో చేశానని, నా కుమారుడు కేటీఆర్‌ను సీఎంగా చేయాలనుకుంటున్నానని మీ సహకారం కావాలని అడిగారన్నారు. మీరు రాజులా యువరాజును సీఎం చేయడానికి ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని చెప్పానన్నారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను ఆయనకు చెప్పానన్నారు. అదే ఆఖరి రోజని, నాకళ్లలో కళ్లు పెట్టి కూడా చూసే ధైర్యం చేయడం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు నా కోసం పెద్దపెద్ద పులమాలలతో స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌ ఎన్నికల తర్వాతా మళ్లీ కలువలేదని, నా నీడను కూడా చూసి భయపడుతున్నారన్నారు.



జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాతా సీన్ మారిపోయిందన్నారు. కేసీఆర్ తీరు చూసి ఆశ్చర్యపోయానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆరెస్ మద్దతునిచ్చిందన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారిగా ఒక్కటిగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత దేశంలో మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు.ఆలయాల సంపదను తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, మైనార్టీల ప్రార్ధన మందిరాల జోలికి మాత్రం వెళ్లడం లేదన్నారు. ఎంత జనాభా ఉంటే అంత హక్కు అని కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు.

అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతుందన్నారు. కాంగ్రెస్‌, బీఆరెస్‌ల సిద్ధాంతాం ఒక్కటేనని అది ఎన్నికల ముందు వాగ్ధానాలు చేయడం..ఎన్నికల తర్వాాతా మరిచిపోవడమేనని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి, కాంగ్రెస్‌లు మహిళా బిల్లు ఆమోదం కాకుండా అనేక కుట్రలు చేశాయని ఆరోపించారు. బయట బిల్లుకు మద్దతు చెబుతూ లోపల కుట్రలు చేసేవారని ఆరోపించారు. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే తాను మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయగలిగానన్నారు. తెలంగాణను నిజాం నుంచి సర్ధార్ పటేల్ విముక్తి చేశారని, ఈ గుజరాతీ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.



తెలంగాణ అభివృద్ధిలో తన సహకారం ఉందని, కరోనా వ్యాక్సిన్ తెలంగాణ నుంచే దేశానికి అందించడం జరిగిందన్నారు. తెలంగాణ కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు అందిస్తే బీఆరెస్ కుటుంబ ప్రభఉత్వం వాటిని లూఠీ చేసిందని మోడీ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబ స్వామ్యంగా , లూఠీ స్వామ్యంగా మార్చేశారని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను కుటుంబం కబ్జా చేసిందన్నారు. కుటుంబ పాలనలో అంతా తమ కుటుంబ లబ్ధికే చూసుకుంటారని, వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ కుటుంబ పాలనకు ఓటమి ఖాయమన్నారు.