మేడిగడ్డ.. లోపాల కుప్ప.. సవరించేదాకా నీళ్లు నింపొద్దు

- అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు
- కూడా ప్రమాదకరంగా ఉన్నాయి
- మేడిగడ్డ కుంగడానికి నాలుగు కారణాలు
- మేడిగడ్డపై కీలక రిపోర్టు విడుదల చేసిన
- సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
విధాత: మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది.మేడిగడ్డ బరాజ్ కూలడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వెల్లడైందని తెలిపింది. నిర్మాణ లోపాలు సవరించే వరకు మేడిగడ్డ బరాజ్‌లో నీళ్లు నింపవద్దని సూచించింది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై కీలక రిపోర్టును శుక్రవారం అథారిటీ విడుదల చేసింది.

బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు కుంగాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. అథారిటీ కమిటీ కోరిన డాటాను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొన్నది. 20 అంశాలపై డాటా అడిగితే 11 అంశాలపై ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రం ఇచ్చిన డాటా కూడా అసంపూర్తిగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేసింది. గడుపులోపు డాటా ఇవ్వనందు వల్లే బరాజ్ నిర్మాణంపై అనుమానాలు తలెత్తాయని పేర్కొన్నది.
బరాజ్ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు కూడా చేయలేదని మేము భావిస్తున్నట్టు కమిటీ పేర్కొన్నది. మేడిగడ్డ బరాజ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్ డాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపింది. నిర్మాణ లోపాలు సవరించే వరకు మేడిగడ్డ బరాజ్‌లో నీళ్లు నింపవద్దని స్పష్టంచేసింది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని అథారిటీ హెచ్చరించింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగం పాటించలేదని అభిప్రాయపడింది.

కాళేశ్వరంపై సమగ్ర దర్యాప్తు చేయాలి: కోదండరామ్
వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. నాలుగేండ్లు కూడా నిండకముండే మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ జరుపాలని కోరారు.