Telangana Tourism | తెలంగాణలోని క్షేత్రాలను దర్శించుకోవాలా..? ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం..!

Telangana Tourism | వేసవి వచ్చేసింది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మరో రెండుమూడురోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. చాలామంది వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే, తెలంగాణలోనే చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటికి గురించి ఎక్కువ మందికి తెలియదు. రాష్ట్రంలో ఎన్నో పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సైతం ఉన్నాయి.

Telangana Tourism | తెలంగాణలోని క్షేత్రాలను దర్శించుకోవాలా..? ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం..!

Telangana Tourism | వేసవి వచ్చేసింది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మరో రెండుమూడురోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. చాలామంది వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే, తెలంగాణలోనే చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటికి గురించి ఎక్కువ మందికి తెలియదు. రాష్ట్రంలో ఎన్నో పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సైతం ఉన్నాయి. ఈ వేసవిలో సందర్శించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం ‘టెంపుల్‌ టూర్‌ ప్యాకేజీ’ ప్రకటించింది. తక్కువ ఖర్చుతోనే తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. తెలంగాణ టూరిజం టెంపుల్‌ టూర్‌ (కాకతీయ రీజియన్‌) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నది. పర్యటన రోడ్డు మార్గంలో సాగనున్నది. ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

పర్యటన సాగుతుంది ఇలా..

ప్యాకేజీలో పర్యటన శనివారం హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. కాళేశ్వరం, రామప్ప, వేయి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కీసరగుట్ట తదితర క్షేత్రాలను దర్శించుకునే వీలున్నది. తొలి రోజు రాత్రి 9.30 గంటలకు బషీర్‌భాగ్‌ నుంచి బస్సులో బయలుదేరుతారు. రాత్రి 10 గంటలకు యాత్రి నివాస్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రెండోరోజు వేకువ జామున 5గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. ఉద‌యం 7గంట‌ల‌లోపు కాళేశ్వరంలో దర్శనాలు పూర్తి చేసుకుంటారు. అనంత‌రం రామ‌ప్ప సందర్శనకు బయలుదేరి వెళ్తారు. 11 గంటలకు రామప్ప వరకు చేరుకొని అల్పాహారం చేస్తారు. ఆ తర్వాత రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం వరంగల్‌కు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు హరిత హోటల్‌కు చేరుకొని భోజనాలు చేస్తారు. ఆ తర్వాత యాదగిరిగుట్టకు వెళ్తారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల మధ్య దర్శనాలు పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత కీసరగుట్టకు బయలుదేరుతారు. అక్కడ దర్శనాలను పూర్తి చేసుకొని 8 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఎంతంటే..?

టెంపుల్‌ టూర్‌ ప్యాకేజీ విషయానికి వస్తే పెద్దలకు రూ.2,999గా నిర్ణయించారు. పిల్లలకు రూ.2399 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ నాన్‌ ఏసీ బస్సుల్లో కొనసాగుతుంది. ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు tourism.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలని తెలంగాణ టూరిజం కోరింది.