పోలీస్​ తమ్ముడి సెల్యూట్ – ఆనందబాష్పాల్లో మునిగిపోయిన అన్న… హృదయాలను కదిలించిన వీడియో

ముంబై పోలీస్ పాసింగ్​ఔట్​ పరేడ్‌లో ఒక తమ్ముడి సెల్యూట్ అన్నను తీవ్రంగా భావోద్వేగానికి గురిచేసిన ఘటన వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అన్న ప్రేమ, కష్టం, త్యాగం, గర్వం నెటిజన్లను కదిలిస్తోంది.

అన్నకు తమ్ముడి సెల్యూట్​ – ఆనంద బాష్పాల మధ్య అన్న

అన్నను చూసిన క్షణంలో భావోద్వేగానికి లోనైన తమ్ముడి సెల్యూట్​… కన్నీళ్ల మధ్య అన్నను ఎత్తుకున్న తమ్ముడు. హృదయాన్ని కదిలించే దృశ్యాలు

Elder Brother Breaks Down as Mumbai Cop Salutes Him — Emotional Viral Video

    ముంబై పోలీస్ పాసింగ్​ అవుట్​ పరేడ్‌లో కొత్తగా పోలీసు అధికారైన తమ్ముడు సెల్యూట్ చేయగానే అన్న భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.

    అన్న ప్రేమ, త్యాగం, గర్వం కలిసిన ఈ క్షణం నెటిజన్లను కదిలిస్తోంది.

 

విధాత వైరల్​ డెస్క్​ | 28 మార్చి 2026 | హైదరాబాద్​:

Mumbai Police emotion | ముంబైలో జరిగిన పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఒక సాధారణ దృశ్యం… ఒక్కసారిగా హృదయాలను కదిలించే భావోద్వేగ క్షణంగా మారింది. పోలీస్ అధికారిగా తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన ఒక యువకుడు, పరేడ్​ పూర్తిచేసుకుని పక్కగా వెళ్లి ఒక వ్యక్తి ముందు నిలిచున్నాడు. అప్పటికే ఆ వ్యక్తి కళ్లలోనుండి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. దగ్గరగా వచ్చిన అధికారి తన ముందున్న వ్యక్తికి సెల్యూట్ చేసి, తన తలపాగాను ధరింపజేసి, ఎత్తుకున్నాడు. ఆనందబాష్పాలతో తడిసిపోయిన అతను, ఆ అధికారిని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. అక్కడున్నవారినీ, సోషల్​ మీడియాలో చూసినవారినీ కదలించి కన్నీళ్లు పెట్టించింది.

ఆ అధికారి ముందు నిలబడి ఉన్న వ్యక్తి సాధారణ ప్రేక్షకుడు కాదు — అతని అన్న. కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి, బాధ్యతలను మౌనంగా మోసిన వ్యక్తి, తన తమ్ముడు ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక నిలబడ్డ నిలువెత్తు కష్టం. అతని విజయానికి ప్రేరణనిచ్చిన శక్తి.

ఆనందాల జడివానలో తడిసిముద్దైన అన్నదమ్ములు

పరేడ్‌ అయిపోయాక, తమ్ముడు తన అన్న ముందుకు వచ్చి సెల్యూట్ చేసిన క్షణం… అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఆఫీసర్​ అన్నకు చేసిన సెల్యూట్​లో ఎన్నో భావాలు.. గుర్తొచ్చిన కష్టాలు, మర్చిపోలేని త్యాగాలు.. అది వ్యక్తిగత వందనమే అయినా, ఆ భావంలో మాత్రం కుటుంబ ప్రేమ, గౌరవం, కృతజ్ఞత అన్నీ కలిసిపోయాయి.

అది చూసిన అన్న కళ్లలో గర్వంతో పాటు భావోద్వేగం ఉప్పొంగింది. ఎన్నో సంవత్సరాల కష్టం, కుటుంబ బాధ్యతలు, తమ్ముడి భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలు… ఇవన్నీ ఒక్క క్షణంలో అతని మనసులో మెదిలినట్టుగా, కళ్లలో కన్నీళ్లు వెల్లువెత్తాయి. అతను వాటిని ఆపడానికి ప్రయత్నించినా, ఆ ఆనందాన్ని మాత్రం దాచలేకపోయాడు.

నిశ్శబ్ద ప్రేమకు కన్నీళ్లే సమాధానం

పరేడ్ పూర్తయ్యాక అన్నకు గౌరవంగా తన తలపాగా ధరింపజేస్తున్న తమ్ముడు… కన్నీళ్లతో అన్న ఆలింగనం : గర్వం నిండిన క్షణం

ఈ వీడియోలో అసలు హైలైట్ తమ్ముడు సాధించిన విజయం కాదు… ఆ విజయాన్ని చూసి అన్నలో ఉప్పొంగిన ఆనందం..  మాటల్లో చెప్పలేని గర్వం, త్యాగం, సంతోషం కన్నీళ్లలో ముప్పిరిగొనగా  — ఇవన్నీ అతని కళ్లలో స్పష్టంగా కనిపించాయి.

చివర్లో ఇద్దరూ ఆలింగనం చేసుకున్న క్షణం వీడియోకి మరింత భావోద్వేగాన్ని జోడించింది. ఆ విడియోలో ఎక్కడా మాటలు లేవు… కానీ తోడబుట్టిన బంధం, పరస్పర ప్రేమ, గౌరవం అన్నీ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు కూడా కదిలిపోయి, కన్నీళ్లు పెట్టుకున్నారు.  “ఇదే నిజమైన సోదర ప్రేమ” అంటూ స్పందిస్తున్నారు.

నిజంగానే ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఆ తమ్ముడి విజయానికి వెనుక అన్న పడ్డ శ్రమ, కార్చిన స్వేదం, అనుభవించిన కష్టాలు… ఇవన్నీ ఒక్క క్షణంలో అతని కళ్లల్లో ఆనంద బాష్పాలుగా ఉప్పొంగాయి. ఆ కన్నీళ్లు కేవలం భావోద్వేగం కాదు… సంవత్సరాల త్యాగానికి దక్కిన నిజమైన ప్రతిఫలం. తమ్ముడు చేసిన ఆ వందనం… అన్న కష్టానికి ఇచ్చిన నిశ్శబ్ద గౌరవం.

వీడియో చూసి కదిలిపోయిన ఇంటర్​నెట్​

సెల్యూట్ తర్వాత ఇద్దరూ ఆలింగనం చేసుకున్న క్షణం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో  విపరీతంగా వైరల్ అవడంతో నెటిజన్లు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

“మీ ఇద్దరి పట్ల ఎంతో గర్వంగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా, అన్నలు తమ కలలను తమ్ముళ్ల ద్వారా నెరవేర్చుకుంటారని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నయ్యంటే నాన్నకు మరోరూపమని ఇంకోసారి రుజువైందని ఇంకొకరు, ఈ వీడియో చూసి నిజంగానే కన్నీళ్లు వచ్చాయంటూ చాలా మంది స్పందించారు.

ఈ చిన్న క్షణం ఒక పెద్ద సత్యాన్ని చెబుతోంది — విజయం ఒక్కరి కాదూ… వెనుక నిలబడి నిశ్శబ్దంగా త్యాగం చేసిన వారి భాగస్వామ్యమూ అదే స్థాయిలో ఉంటుంది. ఆ అన్న కళ్లలో కనిపించిన కన్నీళ్లు… ఆ కథని మరింత స్పష్టంగా చెబుతున్నాయి.

Latest News