దొంగ చేతిలో స్కూటర్​.. యజమాని చేతికి​ చలాన్ : హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ సూపర్​!

హైదరాబాద్‌లో విచిత్ర ఘటన. మూడు నెలల క్రితం దొంగిలించబడిన స్కూటర్‌పై ట్రాఫిక్ చలాన్ జారీ కాగా, ఫోటోలో దొంగ ముఖం స్పష్టంగా కనిపించడం చర్చనీయాంశమైంది. పోలీస్, ట్రాఫిక్ వ్యవస్థల మధ్య సమన్వయ లోపాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

దొంగ చేతిలో స్కూటర్​.. యజమాని చేతికి​ చలాన్ : హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ సూపర్​! లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయం లోపం… తప్పించుకుంటున్న దొంగలు

Stolen Scooter, Real Thief Caught on Camera: Hyderabad Man Shocked by Traffic Challan

    మూడు నెలల క్రితం దొంగిలించబడిన స్కూటర్‌పై చలాన్ రావడం, ఫోటోలో దొంగ ముఖం కనిపించడం హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. వ్యవస్థల మధ్య సమన్వయ లోపంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

 

విధాత క్రైం బ్యూరో | హైదరాబాద్​:

హైదరాబాద్‌లో ట్రాఫిక్​ నియంత్రణ లోపాలను బయటపెట్టే విధంగా ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం దొంగిలించబడిన స్కూటర్‌పై ట్రాఫిక్ చలాన్ రావడం, అంతేకాకుండా ఆ చలాన్‌లో దొంగ ముఖం స్పష్టంగా కనిపించడం సంచలనంగా మారింది.

నగరానికి చెందిన ఫైజల్​ రహమాన్​ తన వాహనం దొంగతనంపై ఇప్పటికే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసాడు. ఇప్పటి వరకు దాని ఆచూకీ లేకపోగా,  అదే వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపించడంతో ఆటోమేటెడ్ సిస్టమ్ చలాన్ జారీ చేసింది. బాధితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇప్పుడీ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వ్యవస్థల మధ్య సమన్వయం లోపమే కారణమా?

ఈ ఘటనతో పోలీస్ డేటాబేస్ మరియు ట్రాఫిక్ ఎన్​ఫోర్స్​మెంట్​ వ్యవస్థల మధ్య సమన్వయ లోపం ఉందనే విషయం రుజువవుతోంది. సీసీటీవీ కెమెరాలు నేరస్థుడిని గుర్తించినప్పటికీ, వాహనం ఇప్పటికే దొంగిలించబడిందన్న సమాచారం ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థకు చేరకపోవడం వల్ల అసలు యజమానికి చలాన్ వెళ్లింది.

సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమ వాహనాలు దొంగతనానికి గురైన వ్యక్తులపై చలాన్లు రావడం సదరు యజమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరో పక్క, ట్రాఫిక్​ పోలీసులకు చలాన్​లు రాయడం మీదున్న శ్రద్ధ ట్రాఫిక్​ను నియంత్రించడం మీద ఉండటం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఇటువంటి విషయాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పౌరులు కోరుతున్నారు. కాగా, ఈ సంఘటనపై అధికారులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది.