Snake Swimming video viral | ఆ పాము కచ్చితంగా బెంగాలీయే! కావాలంటే వీడియో చూడండి!
బెంగాల్‌లో జలపుష్పాలకు అదేనండీ.. చేపలకు ప్రత్యేకత ఉంది. చేపల పులుసు వాసన రాని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ.. ఈ వీడియో ప్రజలు చేపలు తినడం గురించి కాదు.. ఒక పాము గురించి..
Snake Swimming video viral | తాజా వర్షాలకు కోల్‌కతా నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. వీటికి సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వరదలా వచ్చిపడ్డాయి. అలాంటి అనేకానేక వీడియోల్లో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఆ ప్రత్యేకతే దానిని వైరల్ చేసింది. ఒక పాము తేటతెల్లంగా ఉన్న వర్షపు నీటిలో ఈదుకుంటూ వస్తున్న వీడియో అది. సహజంగానే పాములంటే భయం.. అంతకు మించి పాముల వీడియో అంటే ఆసక్తి కూడా ఉంటుంది. దీంతో ఇది కూడా ఆసక్తి రేపింది. దాని ప్రత్యేకత ఏంటంటే.. అంత వర్షంలో అది ఆహారాన్ని నోట కర్చుకుని ఈదుతూ కనిపించింది. ఆహారం అంటే ఏ ఎలుకలో, పందికొక్కులో కాదు.. బెంగాలీలు అత్యంత ఇష్టంగా ఆరగించే జలపుష్పం! అదేనండి.. చేప. ఒక చేపను నోట కరచుకొని పాము ఈదుతూ వెళుతుండటాన్ని పై అంతస్తులో ఉండే ఒకరు వీడియో తీసి నెట్టింట వదిలారు.
నిపుణులు, స్థానికులు దీనిని వెంటనే చెకర్డ్ కీల్‌బ్యాక్ అనే జాతికి చెందిన పాముగా గుర్తించారు. దీనిని బెంగాలీలో జోల్ ధోరా అని పిలుస్తారు. ఇది విషరహిత సర్పం. చిత్తడి నేల సమీపంలో ఉంటూ కప్పలు, చేపలు, ఇతర జలజీవాలను తింటుంది. అయితే.. ఇక్కడ విషయం కేవలం పాము చేపను పట్టుకోవడమే కాదు. నిజానికి చేపలు బెంగాల్‌లో ఆహారం కంటే.. అక్కడి ప్రజల సంస్కృతిలో చేపల వంట భాగం. అందుకే ఈ వీడియోకు అంత స్పందన వచ్చింది.
ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కనిపిస్తే నెటిజన్లు ఊరుకుంటారా.. కామెంట్ల వరద పారించారు. ‘దుర్గా పూజకు ముందే కోల్‌కతా, దాని చిన్న ప్రయోజనాలు’ అంటూ ఈ వీడియోతీసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాశారు. ‘కోల్‌కతా వరద ముచ్చట్లు’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో మొదలవుతుంది. ఇక దాని తర్వాత యూజర్లు అందుకున్నారు. ఒక్కొక్కళ్లు తమ టాలెంట్ చూపించారు. ‘తాను సైతం బెంగాలీయేనని బ్రో రుజువు చేశాడు’ అంటూ ఒకరు జోకేశారు. ‘కోల్‌కతాలో పాములు కూడా చేపలను ఇష్టంగా తింటాయి’ అని మరొకరు కామెంటారు. ‘తమ్ముడు ఈ రోజు పండగే చేసుకుంటాడు’ అని మరొకరు వ్యాఖ్యానించగా.. ‘ఇది కోల్‌కతా సమయం’ అని సింపుల్‌గా మరో యూజర్ తేల్చేశారు. భారీ వర్షాలు, వరదలతో కోల్‌కతా నగరం జలమయమైంది. రోడ్లపై, కాలనీల్లో నీరు నిలిచిపోయిన వీడియోలను అనేక మంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఒక వీడియో క్లిప్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు నీళ్ల మధ్యలో వదిలేసి ఉండటం కనిపించింది. కొన్ని వీడియోల్లో ఉద్యోగులు నీళ్లలో నడుస్తూ కార్యాలయాలకు చేరుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. కోల్‌కతాతో నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ కురవనంత స్థాయిలో వర్షం కురిసింది.
View this post on Instagram
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram