“ఫ్రెండ్స్.. క్యాన్సర్ గెలిచింది” – గుండె బద్దలయ్యేలా ఓ యువకుడి పోస్టు
“ఇది నా చివరి దీపావళి కావచ్చు” — స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న 21 ఏళ్ల యువకుడి భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో హృదయాలను కదిలించింది.

21-year-old cancer patient’s emotional Reddit post about seeing Diwali lights for the last time
న్యూఢిల్లీ:
“క్యాన్సర్ గెలిచింది స్నేహితులారా…” 21 ఏళ్ల యువకుడు రాసిన ఈ ఒక్క వాక్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వేలాది మందిని కన్నీళ్లు పెట్టిస్తోంది. రెడ్డిట్‌లో పంచుకున్న ఆయన భావోద్వేగ పోస్టు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలించింది. ఈ యువకుడు 2023 నుండీ స్టేజ్–4 కొలొరెక్టల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎన్నో రకాలుగా కీమోథెరపీలు, ఆసుపత్రిలో నెలలకు నెలలు గడపడంలాంటివన్నీ అయిపోయాక, ఇప్పుడు వైద్యులు కూడా ఇక మార్గాలు లేవని చెబుతూ, ఒక ఏడాది కంటే ఎక్కువ బతకలేకపోవచ్చని చెప్పారట.
“ఇది నా చివరి దీపావళి కావచ్చు…”
దీపావళి సమీపిస్తున్నదని ఇదే తన ‘చివరి’ పండుగ కావచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు. “దీపావళి దగ్గరపడుతోంది… వీధులన్నీ వెలుగులతో మెరిసిపోతున్నాయి. కానీ వీటన్నింటినీ చివరిసారిగా చూస్తున్నానని తెలియడం చాలా బాధగా ఉంది. లైట్లు, నవ్వులు, శబ్దాలు — ఇవన్నీ మళ్లీ నేను చూడలేనేమో అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఎవరో మరొకరు నా స్థానంలో దీపాలు వెలిగిస్తారు… నేను మాత్రం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాను,” అని రాశాడు.
నాకూ కలలున్నాయి.. ప్రపంచాన్ని చుట్టేయాలి, తన వ్యాపారం మళ్లీ మొదలు పెట్టాలి, ఒక కుక్కపిల్లను పెంచుకోవాలి.. ఇవన్నీ చిన్న చిన్నవే అయినా, ఇప్పుడు అవన్నీ కూడా దూరమవుతున్నాయని ఆయన వేదన. “ నా సమయం వేగంగా తగ్గిపోతోందని గుర్తొచ్చినప్పుడు అటువంటి ఆలోచనలు కూడా మాయమవుతాయి,” అని నిర్వేదంగా అన్నాడు.
“ఇంటి వద్దే ఉంటున్నాను… నా తల్లిదండ్రుల ముఖాల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఈ పోస్టు ఎందుకు రాస్తున్నానో తెలియదు. బహుశా… ఈ లోకాన్ని వదిలేముందు నా కథను చెప్పాలనిపించిందేమో” అంటూ రాసాడు.
Cancer won guys , see ya !!!
byu/Erectile7dysfunction inTwentiesIndia
నెటిజన్ల హృదయ స్పందనలు
ఈ పోస్టు చూసిన వేలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. చదివినవారందరి గుండెలన్నీ బద్దలయ్యాయి. మరెంతోమంది దేవుడికి మొరపెట్టుకున్నారు. అద్భుతాలు జరుగుతాయన్నది నిజమే అయితే, దేవుడా ఇతన్ని బతికించు అంటూ ఒక నెటిజెన్ రాసాడు.
పలువురు — “నీ ధైర్యం అద్భుతం”, “నువ్వు మాకు జీవితం ఎంత విలువైనదో గుర్తుచేశావు”, “ప్రతి క్షణాన్ని ఆనందించు” అంటూ ఆత్మస్థైర్యం కలిగించే కామెంట్లు చేశారు.
“నిన్ను నేను ఎప్పుడూ కలవలేదు, కానీ నీ కథ మనసును కదిలించింది. జీవితం ఎప్పుడైనా మారవచ్చు, అప్పుడప్పుడూ అద్భుతాలు కూడా జరుగుతాయి. నీలో ఉన్న ఆ వెలుగును ఆరిపోనీయకు.”
మరో యూజర్ రాశాడు — “నువ్వు రాసిన ‘నాకూ కలలు ఉన్నాయి…’ అన్న లైన్ మనసు తాకింది. ఎక్కడ ఉన్నావో అక్కడే ధైర్యంగా నిలబడు.”
ఈ యువకుడి కథ కేవలం ఒక పోస్టు కాదు — జీవితం ఎంత సున్నితమైందో, ప్రతి క్షణం ఎంత విలువైనదో గుర్తు చేస్తోంది. ఏదో ఒకరోజు అందరూ వెళ్లిపోవాల్సినవారే అయినా, అది ముందే తెలియడం కంటే నరకం ఇంకేదీ ఉండదు. ఆ యువకుడి భరింపలేని ఆవేదన, తీరని కలలు.. ఎందరి హృదయాలనో ద్రవింపజేసాయి. జీవితం శాశ్వతం కాదని చెప్పడం తేలికే. కానీ, సమయం సమీపిస్తున్నదని తెలిసినప్పుడు భరించడమే భారం. అందరికి దీపావళి జ్యోతులు, మతాబులు ఇంటి ముందు వెలుగుతుంటే, ఇక్కడ అవి ఆ తల్లిదండ్రుల గుండెల్లో పేలుతున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం. ఇప్పడు అతని కోసం ప్రార్థించేందుకు వేలాది హృదయాలున్నాయి.
🕯️ English Summary:
A 21-year-old man’s emotional Reddit post about facing his last Diwali due to terminal cancer has moved thousands online. Diagnosed with Stage 4 colorectal cancer in 2023, he shared that doctors have exhausted all treatments. Reflecting on seeing the festival of lights for the last time, he expressed love for life and sorrow for unfulfilled dreams. His heartfelt words — “I’ll miss the lights, the laughter, and the noise” — brought an outpouring of prayers and empathy from people across social media, reminding everyone to value each moment of life.