Pakistan Terrorist | భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన ఓ పాక్ ఉగ్రవాది జుట్టు రాలిపోతుందన్న బాధలో తన ప్లాన్‌ను వాయిదా వేసుకున్నాడు. మిషన్‌ను పక్కనబెట్టి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. జుట్టు కాపాడుకునేందుకు ఉగ్రవాదాన్ని వదిలేసి, విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ చివరకు ఎన్‌ఐఏ అధికారులకు చిక్కి.. షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే క్రమంలో జమ్ము కశ్మీర్‌లో గత నెలలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారిని మహ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాగా గుర్తించారు. వీరిని దర్యాప్తు నిమిత్తం ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ క్రమంలో వారిని ఎన్ఐఏ అధికారులు విచారించిన క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
NIA అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెంది మహ్మద్ ఉస్మాన్ జాట్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందాడు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర దాడులు నిర్వహించడం, స్లీపర్ సెల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసే మిషన్ అప్పగించి భారత్‌కు పంపించారు. దీంతో జాట్ సరిహద్దులు దాటి కశ్మీర్ లోయలోకి చొరబడ్డాడు. ఇక్కడ సీక్రెట్‌గా పలు ప్రాంతాల్లో సంచరించాడు.
తన మిషన్ మీద కశ్మీర్‌లో తిరుగుతున్న సమయంలోనే ఉస్మాన్ జాట్‌కు జుట్టు రాలడం ఎక్కువైంది. చిన్న వయసులోనే బట్టతల రావడంతో ఆత్మన్యూనతా భావానికి గురైనట్లు జాట్ ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తెలిపాడు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ముందే విన్నప్పటికీ.. అలాంటి చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో ధనికులకు మాత్రమే సాధ్యమని భావించాడట. కానీ శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలోనే మరో ఉగ్రవాది అబు సాయంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేయించున్నట్లు తెలిపాడు. శ్రీనగర్‌లోని ఓ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా కొన్నిసార్లు రాత్రంతా క్లినిక్‌లోనే ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడించాడు.
ఈ చికిత్స పూర్తయ్యాక జాట్.. ప్రజా రవాణా సదుపాయాలను వాడుకుంటూ జమ్ము చేరుకున్నాడు. అక్కడి నుంచి పంజాబ్‌లోని మలేర్‌కోట్లాకు వెళ్లాడు. అక్కడ టర్కీ టీవీ సీరియల్స్ చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేశాడు అని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అయితే పాకిస్థాన్‌లోని ఉగ్ర శిక్షణ శిబిరాల్లో కశ్మీర్‌పై పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపించారని, కానీ ఇక్కడి వచ్చిన తర్వాత ప్రజల సాధారణ జీవితం, ప్రశాంత వాతావరణం చూసి తన అభిప్రాయం మారిపోయిందని ఉస్మాన్ జాట్ విచారణలో చెప్పినట్లు సమాచారం.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఉగ్రవాదంలో ఉండటం కంటే.. జుట్టును కాపాడుకునేందుకు సాధారణ జీవితం గడపాలని జాట్ అనుకున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఉగ్ర నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూనే.. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సంపాదించి భారత్ నుంచి మరో దేశానికి వెళ్లిపోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తెలిసింది. ఇక జాట్ ఇచ్చిన సమాచారంతో ఉత్తర కశ్మీర్, శ్రీనగర్‌లో ఉన్న స్లీపర్ సెల్స్, ఉగ్ర అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More:
Viral News | ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్.. లక్షల్లో జీతం.. అయినా జాబ్ మానేసిన పాతికేళ్ల కుర్రాడు
