Viral Video | ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ లాయర్ దగ్గర బ్యాగ్‌ను లాక్కొన్న కోతి చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించింది. కోతి చెట్టుపై నుంచి రూ.500 నోట్లను వెదజల్లుతుంటే వాటిని ఏరుకోవడానికి అక్కడి ప్రజలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
స్థానికుల కథనం ప్రకారం.. యూపీలోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ లాయర్ ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రూ.2లక్షల క్యాష్‌ను ఓ బ్యాగులో తీసుకుని కచేరీ రోడ్డులో వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడకు అకస్మాత్తుగా వచ్చిన ఓ కోతి.. అతని చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని సమీపంలోని చెట్టుపైకి ఎక్కింది. అనంతరం చెట్టుపై తాపీగా కూర్చున్న కోతి.. బ్యాగ్ తెరిచింది. బ్యాగులో ఉన్న రూ.500 నోట్లను ఒక్కొక్కటిగా కిందకు విసరడం ప్రారంభించింది. గాల్లో ఎగిరిపడుతున్న నోట్లను చూసి స్థానికులు, అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా వాటిని ఏరుకునేందుకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపటికే ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది.
ఈ క్రమంలో లాయర్, అతని స్నేహితులు కొందరు చెట్టుపైకి ఎక్కి కోతిని తరిమేందుకు యత్నించారు. కానీ చాలాసేపటి వరకు కోతి అలాగే నోట్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత బ్యాగ్‌ను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ లాయర్ తన బ్యాగును తీసుకున్నాడు. అయితే బ్యాగులో నుంచి ఎంత డబ్బు పోయింది అన్న దానిపై క్లారిటీ లేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అలాగే పలువురు తమ మొబైల్ ఫోన్లలోనూ రికార్డు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.