Child eve-teasing |
ఢిల్లీలో ఓ మహిళను 7 ఏళ్ల బాలుడు అవమానకరంగా సంబోధించడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, పిల్లల పెంపకం, మహిళల భద్రతపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

Child eve-teasing | ఢిల్లీలో ఓ మహిళ తన నివాస సముదాయంలో నడక కోసం బయటకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవం ఆమెను షాక్‌కు గురి చేసింది. 7 ఏళ్ల చిన్నారి ఒకడు ఆమెను అవమానకరంగా సంబోధించడంతో విషయం వేధింపుల దిశగా వెళ్లింది.
ఆమె ఎరుపు టాప్, పొడవాటి స్కర్ట్ ధరించి నడుస్తుండగా ఆ బాలుడు “ఓ లాల్ పరీ…” అంటూ, “క్యా తు చలేగీ?” అంటూ పోకిరీ మాటలతోనే వేధించాడు. ఈ మాటలు విన్న క్షణం ఆమె తట్టుకోలేకపోయింది. అంతేకాక సముదాయం భద్రతా సిబ్బంది ఈ దృశ్యాన్ని చూసి నవ్వుకోవడం ఆమెను మరింత బాధించింది. తర్వాత బాలుడిని ప్రశ్నించగా వాచ్‌మన్ మధ్యలో జోక్యం చేసుకొని క్షమాపణ చెప్పమన్నాడు. బాలుడు “సారీ” అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. “ఒక చిన్నారి ఇలా మాట్లాడటం సరదా కాదు. పిల్లలు ఇలాంటి మాటలు తమకు తాము మాట్లాడలేరు. వారు ఇంట్లోనో, వీధిలోనో వింటారు, చూస్తారు. అదే కాపీ చేస్తారు. ఇక్కడి నుంచే ‘సరదా’గా మొదలై, తర్వాత పెద్దయ్యాక అది వేధింపుగా మారుతుంది” అని ఆ మహిళ కిరణ్ గ్రేవల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వివరించారు. వీడియో చూడండి:
View this post on Instagram
కానీ వాచ్‌మన్ మాత్రం ఆ బాలుడు “మంచి కుటుంబం నుంచి వచ్చాడు, సరదాగా అన్నాడు” అని చెప్పి విషయం పెద్దది కాకుండా చూడటానికి ప్రయత్నించాడు. దీనికే ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే వయస్సు చిన్నది కాబట్టి తప్పు చేయొచ్చనే అన్న భావన సమాజానికి ప్రమాదకరమని కిరణ్ హెచ్చరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది “ఇలాంటి సమయంలోనే బాలుడి తల్లిదండ్రులను కలిసి జరిగింది చెప్పాలి. ఇప్పుడే సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఇదే అలవాటు కొనసాగుతుంది” అని సూచించారు.
ఒక నెటిజెన్ “చెడు సమాజం, చెడు పెంపకం. మీ బాధలో అర్థం ఉంది” అని వ్యాఖ్యానించగా, మరొకరు “తక్షణమే బాలుడి తల్లిదండ్రులను మందలించాలి. ఈ వయసులోనే సరిదిద్దితే భవిష్యత్తు మెరుగవుతుంది” అన్నారు. మరో కామెంట్ “ఇంత చిన్న వయసులోనే ఆకతాయి భాష వాడటం, పక్కవాళ్లు నవ్వడం, వాచ్‌మన్ సమర్థించడం – ఇవన్నీ మన సమాజం ఎలా ఉందో చెప్పేస్తున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేసింది.