Elephant Attacks Crocodile | తొక్కి నార తీసింది…మొసలిపై ఏనుగు ప్రతాపం
అడవిలో ఏనుగు నీటిలోని మొసలిపై దాడికి దిగింది; తొక్కి నార తీసినట్లుగా భీకర దాడి చేసి మొసలిని ఓడించింది, వీడియో వైరల్ అయింది.

విధాత : స్థాన బలానికి నిదర్శనంగా నీళ్లలోని మొసలిని చెప్పుకుంటారు. ఇందుకు నిదర్శనంగా గజేంద్ర మోక్షం పురాణ కథను గుర్తు చేసుకుంటారు. నీటిలోని మొసలికి చిక్కిన ఏనుగు దానితో పోరాడి గెలవలేక..శ్రీహరిని శరణు కోరడం..విష్ణుమూర్తి సుదర్శన చక్రాయుధంతో మొసలిని కడతేర్చి గజేంద్రుడిని రక్షించడం తెలిసిందే. అయితే తాజాగా ఓ అడవిలో జరిగిన మొసలి..ఏనుగు ఘర్షణలో ఈ కథ రివర్సైంది. నీటి మడుగులో ఉన్న మొసలి నీరు తాగేందుకు వచ్చిన ఏనుగు గుంపులో ఓ ఏనుగు కాలిని నోట పట్టుకుంది. బాధతో విలవిలలాడిన గజరాజు ఆగ్రహంతో మొసలిపై ప్రతిదాడికి దిగింది. మొసలి పట్టు నుంచి తప్పించుకునే క్రమంలో ఏనుగు తన తొండంతో మొసలిని నీళ్లనుంచి పైకి లేపుతూ..కాళ్ల కింద వేసి తొక్కుతూ భీకర దాడికి దిగింది.
ఎంతగా అంటే తొక్కి నారా తీసిందన్న మాటకు సరిగ్గా సరిపోయే రీతిలో మొసలిని ఏనుగు చీల్చి చెండాడింది. వాస్తవానికి ఆ నీటి మడుగులో నీరు తక్కువగా ఉండటం ఏనుగు పోరాటానికి కలిసి వచ్చింది. అలాగే సహచర ఏనుగులు కూడా అండగా ఉన్నాయి. దీంతో ఏనుగు ధైర్యంగా మొసలిపై దాడికి దిగి హతమార్చి సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.