విధాత : ప్రకృతిలో వన్యప్రాణులు..సరిసృపాలు..జలచరాలకు వేటతోనే ఆహారం లభించడం వాటి జీవన విధానం. అయితే ఆహారం సాధన కోసం వన్యప్రాణులు ఒక్కోసారి శక్తికి మించిన సాహసంతో వేటాడుతూ..ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు అధ్బుత విజయాలు సాధించడం..మరికొన్నిసార్లు పరాజయాల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే నీళ్లలో ఉన్నంతవరకు బలమైన జంతువుగా ఏనుగును సైతం నిలువరించే శక్తివంతమైనదిగా పేరొందిన మొసలిని ఓ చిరుత చెట్టుపై నుంచి వేటాడిన తీరు నెవర్ బిఫర్..ఎవర్ ఆఫ్టర్ అనిపించకమానదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అటవీ ప్రాంతంలోని ఓ సరస్సు ఒడ్డున ఉన్న చెట్టుపై ఓ చిరుత పులి కూర్చుని ఆహారం కోసం వేటాడేందుకు పొంచి ఉంది. అదే సమయంలో నీళ్లలో ఉన్న మొసలిని చిరుత పులి చూసింది. అంతే చెట్టుపై నుంచి ఒక్క ఉదుటన నీళ్లలోకి దూకేసిన చిరుత మొసలిని నోట కరుచుకుని అంతే వేగంగా ఒడ్డుకు చేరుకుంది. ఈ వేటలో ఏ మాత్రం ఆలస్యం చేసినా నీళ్లలోని మొసలి ప్రతిఘటనను చిరుత ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే వేగానికి మారుపేరైన చిరుత నీళ్లలో స్థాన బలమున్న మొసలిని అత్యంత లాఘవంగా వేటాడేసి ఆహారాన్ని సంపాదించుకోగల్గింది. ఇదంతా అక్కడే సరస్సులో బోటుపై ఉన్న సిబ్బంది తమ వీడియోలు బంధించగా చిరుత వేట దృశ్యాలు వైరల్ గా మారాయి.