ఏప్రిల్ 1 నుంచి మీ జీతం, పన్ను, ఉద్యోగ నియమాలు మారుతున్నాయి… సిద్ధంగా ఉన్నారా?

ఏప్రిల్ 1, 2026 నుంచి జీతం నిర్మాణం, PF పెరుగుదల, ఉద్యోగం వదిలితే 2 రోజుల్లో సెటిల్మెంట్, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం, ట్యాక్స్ ఇయర్, విదేశీ ఖర్చులపై TCS తగ్గింపు వంటి కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. పూర్తి ఎక్స్‌ప్లైనర్ చదవండి.

ఏప్రిల్ 1 నుంచి జీతం, పన్నులు, ఉద్యోగ నియమాల్లో మార్పులపై ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్… జీతం నుంచి ఉద్యోగం వదిలే వరకు ప్రభావం

Your Salary, Tax & Job Exit Rules Change From April 1 – Are You Ready?

ఏప్రిల్ 1 నుంచి జీతం, పన్నులు, ఉద్యోగ నియమాల్లో భారీ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.

బేసిక్ జీతం 50% తప్పనిసరి, ఉద్యోగం వదిలితే 2 రోజుల్లో సెటిల్మెంట్, కొత్త ట్యాక్స్ ఇయర్, విదేశీ ఖర్చులపై తక్కువ TCS వంటి మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.

 

 

✦ విధాత ప్రత్యేక విశ్లేషణ ✦

 

జీతం నుంచి పన్నుల వరకు… ఒకేసారి భారీ మార్పులు

హైదరాబాద్: ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో ఉద్యోగుల జీవితానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో పెద్ద మార్పులు అమల్లోకి వస్తున్నాయి. జీతం ఎలా ఉండాలి, PF ఎంత కట్ అవుతుంది, ఉద్యోగం వదిలిన తర్వాత డబ్బు ఎప్పుడు వస్తుంది, పన్ను ఎలా లెక్కించాలి—ఇలా ప్రతి దశలో కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దాదాపు 65 ఏళ్ల పాత పన్ను చట్టానికి ముగింపు పలుకుతూ, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వస్తోంది. అదే సమయంలో లేబర్ కోడ్‌లు కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి.

ఈ మార్పులు మొదట్లో కొంత గందరగోళంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచడం, పన్ను వ్యవస్థను సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకొచ్చినవే. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో వేతన నిర్మాణం మారడం, PF, గ్రాట్యుటీ పెరగడం, ఉద్యోగం వదిలిన వెంటనే డబ్బు రావడం వంటి అంశాలు ఉద్యోగుల దృష్టిలో కీలకంగా మారనున్నాయి.

 పే స్లిప్‌లో పెద్ద మార్పు… 50 శాతం బేసిక్ తప్పనిసరి

బేసిక్ జీతం 50% నిబంధనతో సాలరీ స్లిప్‌లో మార్పులు… PF, టేక్‌హోమ్‌పై ప్రభావం

ఇప్పటి వరకు చాలా కంపెనీలు ఒకే విధానం అనుసరించేవి. బేసిక్ జీతాన్ని 25% నుంచి 40% మధ్యలో ఉంచి, మిగతా మొత్తాన్ని HRA, స్పెషల్ అలవెన్స్, ఇతర అలవెన్సుల రూపంలో చూపించేవి. దీని వల్ల ఉద్యోగులకు చేతికి వచ్చే జీతం ఎక్కువగా కనిపించినా, PF, గ్రాట్యుటీ లెక్కలు మాత్రం తక్కువగా ఉండేవి.

ఇప్పుడు ఈ విధానానికి ముగింపు పలికారు. కోడ్ ఆన్ వేజెస్ 2019 ప్రకారం, బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్ కలిపి మొత్తం CTCలో కనీసం 50 శాతం ఉండాలి. ప్రైవేట్ రంగంలో సాధారణంగా DA ఉండదు కాబట్టి, బేసిక్ జీతాన్ని పెంచాల్సి వస్తుంది. అలవెన్సులు 50 శాతం దాటితే, మిగిలిన భాగాన్ని కూడా వేతనంగా పరిగణించి PF, గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఈ నియమం చిన్న స్టార్టప్‌ల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరికీ వర్తిస్తుంది.

👉ఉద్యోగులపై దీని ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. తక్షణంగా చూస్తే, నెలవారీ టేక్ హోమ్ జీతం కొద్దిగా తగ్గవచ్చు. కారణం PF కాంట్రిబ్యూషన్ పెరగడం. కానీ దీర్ఘకాలంలో చూస్తే, ఇదే పెద్ద లాభంగా మారుతుంది. PFలో ఎక్కువ మొత్తాలు జమ అవుతాయి. గ్రాట్యుటీ కూడా చివరి మూల వేతనం ఆధారంగా లెక్కిస్తారు కాబట్టి, ఉద్యోగం వదిలేటప్పుడు ఎక్కువ మొత్తం లభిస్తుంది.

👉 కంపెనీలకు మాత్రం ఈ మార్పు కొంత భారంగా మారవచ్చు. PF, గ్రాట్యుటీ ఖర్చులు 5% నుంచి 15% వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా IT, BPO, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

ఉద్యోగం వదిలితే’ సెటిల్మెంట్​ కోసం వేచి ఉండాల్సిన పని లేదు

ఏప్రిల్ 1 నుంచి వేతన నిర్మాణంలో మార్పులు… PF, గ్రాట్యుటీ లెక్కల్లో ప్రభావం

ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య—ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఆలస్యం. ఇప్పటి వరకు ఉద్యోగం వదిలిన తర్వాత 30 నుంచి 90 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఇది ఆర్థిక ఇబ్బందులకు దారి తీసేది.

ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు. కోడ్ ఆన్ వేజెస్ సెక్షన్ 17(2) ప్రకారం, ఉద్యోగి చివరి పని రోజు నుంచి రెండు పని దినాలలోనే అన్ని వేతన సంబంధిత బకాయిలను చెల్లించాలి. ఇందులో పెండింగ్ జీతం, లీవ్ ఎన్​క్యాష్‌మెంట్, ఇతర డ్యూస్ అన్నీ ఉంటాయి. ఉద్యోగి రాజీనామా చేసినా, కంపెనీ తొలగించినా, కాంట్రాక్ట్ ముగిసినా ఈ నియమం వర్తిస్తుంది. కంపెనీ ఆలస్యం చేస్తే అది చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. అవసరమైతే రాష్ట్ర లేబర్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేసి, వడ్డీతో పాటు డబ్బు పొందే అవకాశం ఉంటుంది.

ఉద్యోగం వదిలితే‘ అంటే ఏమిటి?

ఉద్యోగి స్వయంగా రాజీనామా చేసినా, కంపెనీ తొలగించినా, కాంట్రాక్ట్ ముగిసినా లేదా రీస్ట్రక్చరింగ్ కారణంగా ఉద్యోగం కోల్పోయినా – ఈ అన్ని పరిస్థితులను “ఉద్యోగం వదిలినట్టు”గా పరిగణిస్తారు. ఈ సందర్భాల్లోనే 2 పని రోజులలో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

అయితే గ్రాట్యుటీ చెల్లింపులకు 30 రోజుల గడువు అలాగే కొనసాగుతుంది. PF ట్రాన్స్‌ఫర్ కూడా EPFO ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ఇవి రెండు రోజుల నిబంధనలోకి రావు.

పాత పన్ను చట్టానికి ముగింపు… కొత్త చట్టం అమల్లోకి

1961 నుంచి అమల్లో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు పూర్తిగా మారుతోంది. దాని స్థానంలో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వస్తోంది. ఈ చట్టం పాత చట్టంతో పోలిస్తే చాలా సరళంగా రూపొందించబడింది.

పాత చట్టంలో 819 సెక్షన్లు ఉండగా, కొత్త చట్టంలో వాటిని 536కి తగ్గించారు. చాప్టర్లు కూడా 47 నుంచి 23కు తగ్గాయి. ముఖ్యంగా భాషను సరళతరం చేయడం వల్ల సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే పన్ను రేట్లు లేదా ఎక్కువ భాగం డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. ఇది ఒక నిర్మాణాత్మక సంస్కరణ మాత్రమే.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే — 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను కింద వస్తుంది. 2026 ఏప్రిల్ 1 తర్వాత వచ్చే ఆదాయం కొత్త చట్టం ప్రకారం పరిగణించబడుతుంది.

ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ గందరగోళానికి గుడ్‌బై – ఇక ట్యాక్స్ఇయర్​

ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్(Previous Year), అసెస్‌మెంట్ ఇయర్(Assessment Year) అనే రెండు పదాలు ఉండటం వల్ల చాలా మందికి అయోమయం ఉండేది. ఇప్పుడు ఈ రెండింటిని తొలగించి, ఒకే ట్యాక్స్ ఇయర్(Tax Year) అనే పదాన్ని ప్రవేశపెట్టారు.

ఉదాహరణకు 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు కాలాన్ని ట్యాక్స్ ఇయర్ 2026-27గా పిలుస్తారు. ఇది పన్ను వ్యవహారాల్లో స్పష్టతను తీసుకువస్తుంది.

విదేశీ ప్రయాణాలు, చదువు ఖర్చులపై ఊరట

విదేశీ టూర్లు, విద్య ఖర్చులపై TCS తగ్గింపు… ప్రయాణికులకు ఊరట

విదేశీ టూర్ ప్యాకేజీలు, విద్య, వైద్య అవసరాల కోసం విదేశాలకు డబ్బు పంపే వారికి పెద్ద ఊరట లభించింది. ముందుగా ఈ ఖర్చులపై 5% నుంచి 20% వరకు TCS వసూలు చేయబడేది. ఇప్పుడు ఈ రేటును ఫ్లాట్ 2%కి తగ్గించారు.

ఇది చివరికి ట్యాక్స్‌లో సర్దుబాటు అయ్యే అడ్వాన్స్ ట్యాక్స్ అయినప్పటికీ, ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు బ్లాక్ అయ్యే పరిస్థితి తగ్గుతుంది. దీని వల్ల పర్యటక పరిశ్రమ, విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై కొత్త షరతులు

సావరిన్ గోల్డ్ బాండ్స్(Sovereign Gold Bonds) పెట్టుబడిదారులకు కూడా ఒక కీలక మార్పు ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కొనుగోలు చేసినా మెచ్యూరిటీ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఉండేది.

ఇప్పుడు రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా కొనుగోలు చేసిన బాండ్స్‌కు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ వంటి సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన బాండ్స్‌పై లాభాలకు పన్ను పడుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా షార్ట్ టర్మ్ ఆదాయంగా పరిగణించి పన్ను లెక్కిస్తారు.

రిటర్న్ సవరించుకోవడానికి ఎక్కువ గడువు… కానీ జాగ్రత్త అవసరం

ఇంకో మార్పు – పన్ను రిటర్న్‌ల సవరింపులో ఉంది. ఇప్పటి వరకు ట్యాక్స్ ఇయర్ ముగిసిన తర్వాత 9 నెలల వరకు మాత్రమే సవరించిన రిటర్న్ ఫైల్ చేయగలిగేవారు. ఇప్పుడు ఈ గడువును 12 నెలలకు పెంచారు.

అయితే 9 నెలల తర్వాత ఫైల్ చేస్తే అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా తప్పులను సరిచేసుకోవడం మంచిది.

ఒక్కసారి చూస్తే…

ఈ మార్పులన్నింటిని ఒకేసారి పరిశీలిస్తే:

మొత్తం మీద ఈ మార్పులు ఉద్యోగుల రక్షణ, భవిష్యత్తు సేవింగ్స్ పెంపు, పన్ను వ్యవస్థ సరళీకరణ లక్ష్యంగా తీసుకొచ్చినవిగా చెప్పొచ్చు.

👉 మీ కంపెనీ HR నుంచి కొత్త పే స్లిప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం మంచిది.
👉 ఉద్యోగం మార్చాలని భావిస్తే, ఈ కొత్త నియమాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం అవసరం.

Latest News