మారకపోతే మనుగడ లేదు!.. అయినా ఇంకా వదలని అహంకారపు మాటలు

2018 డిసెంబర్ 7.. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగిన రోజు. 11వ తేదీన కౌంటింగ్. తెలంగాణ రాష్ట్ర సమితి బంపర్ మెజారిటీలతో 119 సీట్లకు గాను 88 సీట్లను గెల్చుకుంది

మారకపోతే మనుగడ లేదు!.. అయినా ఇంకా వదలని అహంకారపు మాటలు

తిరుగులేని మెజార్టీ వచ్చిన నాడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వల
సీఎల్పీ విలీనం సంసారపక్షమేనంటూ వాదనలు
గత ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్‌
బీఆరెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న అధికారపక్షం
కానీ.. ఇది వ్యభిచారమంటూ బీఆరెస్‌ గగ్గోలు!
అధికారం చేజారడంతో శూన్యం ఆవహించిన కేసీఆర్‌

అధర్వ

2018 డిసెంబర్ 7.. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగిన రోజు. 11వ తేదీన కౌంటింగ్. తెలంగాణ రాష్ట్ర సమితి బంపర్ మెజారిటీలతో 119 సీట్లకు గాను 88 సీట్లను గెల్చుకుంది. అధికారం చేపట్టడానికి కావల్సిన మెజారిటీ 60 మాత్రమే. అంటే టీఆరెస్‌కు 28 సీట్లు ఎక్కువగా వచ్చాయి. ముస్లిం మిత్రుడి 7 సీట్లు ఎలాగూ ఉన్నాయి. చాలా సౌకర్యవంతంగా అధికారం చేపట్టారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను వశం చేసుకున్నది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు పాలించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ఏకంగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను నిస్సిగ్గుగా ‘ఆకర్షించి’, కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నాడు. ఇది సంసార పక్షంగా జరిగింది.

2023 డిసెంబర్ 3.. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు. కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో 119 సీట్లకుగాను 64 గెలుచుకున్నది. అధికారానికి కావాల్సింది యధాతథంగా 60. కేవలం నాలుగు సీట్ల ఆధిక్యతతో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఉన్న నాలుగు ఊడితే ఖతం. అధికారం నిలుపుకోవడానికి ఇంకా ఎమ్మెల్యేల బలం కావాలి. కాబట్టి నయాన్నోభయాన్నో బీఆరెస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇది మాత్రం వ్యభిచారంగా మారింది. ఎలా?

12 మంది ‘కొనుగోలు’ ప్రజాస్వామ్యబద్ధమైతే, ఇప్పుడు జరుగుతున్నది కూడా ప్రజాస్వామ్యబద్ధమే కదా..! 40 ఏళ్ల నుండి రాజకీయాలలో ఆరితేరిన కేసీఆర్‌కు ఈ మాత్రం తెలియదనుకుంటే పొరపాటు. కానీ, అధికారం పోతుందని కలలో కూడా ఊహించని ఆయనను ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. ఎటుచూసినా, ఎవరూ కనబడటం లేదు. నిన్నమొన్నటి వరకు తన వద్ద ఉన్న బెల్లం ఇప్పుడు లేదు. అందుకే ఈగలూ లేవు. ఉన్న ఒకటో రెండో, రేపో మాపో అన్నట్లున్నాయి. జనం మైమరిచే అద్భుత వాగ్ధాటి కలిగిన నేత.. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని అయోమయంలోకి జారిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతీమాటా ఇంకా వదలని అహంకారానికి అద్దం పడుతోంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా దుర్లభమైన ఆయన దర్శనం, ఇప్పుడు సామాన్య పౌరుడికి కూడా సులభమైంది.

ఎర్రవల్లిని మరో పుట్టపర్తిగా మార్చిన కేసీఆర్ బాబా, రోజూ కొంతమందిని పిల్చుకుని, భోజనాలు పెట్టి, సెల్ఫీలు దిగి ‘అదిగో నవలోకం..’ అంటూ చూపిస్తూ ఆనందిస్తున్నాడు. ప్రజలందరూ ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని, టార్చిలైట్లు, లాంతర్లు, కాగడాలు పట్టుకుని ఎక్కడ కేసీఆర్ అని దేవులాడుకుంటూ వస్తున్నారట. ఈయన చీకట్లో సూర్యుడు మరి! తన ఓటమి వల్ల దేశ రైతాంగం ఆశలన్నీ ఆవిరైపోయాయట. ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే ప్రజలకు ఆయన పరిస్థితిపై సందేహం రాకుండా ఉంటుందా? మరి అలాంటిది పాపం.. ఎమ్మెల్యేలకు, పార్టీ ప్రముఖులకు ఇంకెలా ఉంటుంది? కీలెరిగి వాతపెట్టినట్లు, కేసీఆర్ బలమెవరో, ఏదో పక్కాగా తెలుసుకున్న రేవంత్, కరెక్ట్‌గా అక్కడే దెబ్బ కొడుతున్నాడు. పైగా గత ప్రభుత్వంలో ఉచ్ఛనీచాలు మరిచి, ఫోన్ ట్యాపింగ్ అనే అత్యంత హీనమైన కార్యానికి ఒడిగట్టడంతో, దాని బాధితులు రగిలిపోతున్నారు. అందులో కూడా రేవంత్ ప్రథముడు. వ్యక్తిగతంగా కూడా.

అంటే.. దీనర్థం.. కేసీఆర్ పని అయిపోయిందనీ. ఇక ఆయన రాజకీయ జీవితం అంతమైందనీ.. ఇంక తను ఏం చేయలేడనీ, ఏం మాట్లాడలేడనీ, పార్టీని ఇక నడిపించలేడనీ.. హింసించిన ఈ రెండవ రాజు పులకేశి ఇక ఏ రాచరికానికీ పనికిరాడనీ.
కిం కర్తవ్యం.? వాట్ నెక్స్ట్.?

ఇప్పుడు బీఆరెస్‌కు దిక్కెవరు? నిన్ననే పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ పశ్చాత్తాప ప్రకటనొకటి చేసారు. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామని. ఇప్పుడు తెగిన ఆ బంధాన్ని అతికించగలిగేదెవరైనా ఉన్నారా? లేక తల్లీబిడ్డా ఇక శాశ్వతంగా విడిపోవడమేనా? ఒక్క అవకాశమైతే ఉంది. పార్టీ పగ్గాలను యువనాయకత్వానికి అప్పగించి కేసీఆర్ వానప్రస్థాన్ని స్వీకరించడం. కానీ అది సాధ్యమయ్యే పనేనా? నరనరాన అధికారపు అహం జీర్జించుకున్న కేసీఆర్ పార్టీ నాయకత్వాన్ని, పెద్దరికాన్ని వదులుకుంటారా? సొంత మీడియా భజనలకు ఇంకా పొంగిపోతున్న ఆయనకు నాయకత్వ యావ తగ్గిందని ఎలా అనుకుంటాం? గడచిన రెండు రౌండ్ల (అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు) తర్వాత కూడా పొగరు మిగిలే ఉందంటే ప్రజలు, ఇక లాభం లేదురా, ఇంకో రౌండ్ (స్థానిక సంస్థల ఎన్నికలు) వేయాల్సిందే అంటే? అసలు ఆయన భజన పత్రికే ఆయన నాశనానికి కారణమని పార్టీ వర్గాలు దుమ్మెత్తిపోసిన సంగతి కేటీఆర్‌కు బాగా తెలుసు. అపాత్రదానం చేయడంలో కేసీఆర్‌ను మించినవారెవరూఉండరు. అది సలహాదారైనా సరే, సన్మానమైనా సరే, పదవైనా సరే, పత్రికైనా సరే.. ఒకప్పుడు ఆయుధమై, సకల తెలంగాణ జనాన్ని ఏకం చేసి, రాష్ట్రాన్ని సాధించిన పత్రిక ఇప్పుడు అంత్యదశకు చేరుకున్నా, దాన్ని కూడా సంస్కరించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడు. నిజానికి 2019 నుండే కరోనా వైరస్, కేసీఆర్ పతనం ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. అది ఆయన గుర్తించలేదు. ఇప్పుడిక గుర్తించాల్సిన అవసరం కూడా లేదు.

దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. పార్టీ బతికి బట్టకట్టాలంటే, నవ నాయకత్వమే అవసరం. వినూత్న, తాజా ఆలోచనలు అవసరం. ప్రపంచం సాగుతున్న వేగాన్ని అందుకోవడం అవసరం. ఇవన్నీ ఇక కేసీఆర్‌తో కావు. కేటీఆర్, హరీశ్.. ఈ ఇద్దరే ఇప్పుడు పార్టీని కాపాడి, గాడిలో పెట్టగల స్థాయిలో ఉన్న యువ నాయకులు. ఒక పక్క ఒక్కొక్క ఈకా రాలిపోతోంటే ఇంకా కేసీఆర్ ఎలా ఎగరగలడు? కనీసం ఇప్పుడు వారికి పార్టీని అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికన్నా కొత్త ఈకలతో, యువరక్తంతో, ఉక్కుపిడికిళ్లతో, నవయవ్వనంగా తయారై నవతెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం మళ్లీ వస్తుంది. బీఆరెస్‌ను మళ్లీ టీఆరెస్‌గా మార్చి, అట్టడుగు నుంచి పునర్నిర్మాణం చేసి, ప్రజలతో మమేకమై కదలితే, వారు నడవడానికి సిద్ధంగానే ఉంటారు. గుణాత్మకమైన మార్పు ఎల్లప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుంది. కానీ, ఈ స్థాయి మార్పులకు కేసీఆర్ ఒప్పుకుంటాడా? లేదా? అనేదే అసలు పరీక్ష. చింత చచ్చినా పులుపు చావకపోతే చచ్చే చావే. స్వర్గం సంగతి దేవుడెరుగు. ఉట్టిని పది కాలాలపాటు పగలకుండా కాపాడుకుంటే అదే పదివేలు.

లేదంటే..? పెను ప్రమాదం ముందుంది. అసలు పార్టీనే లేకుండా తుడిచిపెట్టుకుపోయే తుఫాను వస్తుంది. ఒకపక్క రేవంత్, రెండో పక్క నరేంద్ర మోదీ. ఇంకో పక్క కొత్తగా రెండు కళ్ల బాబు మళ్లీ సిద్ధమంటున్నాడు. నిజానికి ఈ మూడు పక్కలూ ఒక్కటే. ఆరు చేతులతో తెలంగాణను అన్ని దిక్కులా కమ్ముకుంటూ వస్తున్నాయి. ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణకు ఎటువంటి ప్రత్యేక ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు. వాటికి తెలంగాణ ప్రాధాన్యాంశాలు ఎప్పటికీ ముఖ్యం కాదు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఇప్పుడు ఒక ఏటీఎం. వారి అవసరం అంతే. కేంద్రంలో అధికారంలో ఎలాగూ లేరు కాబట్టి వారేం చేయలేరు. తమ పార్టీని నడుపుకోవాలంటే, తన పాలిత రాష్ట్రాలనుండి కాసులు కావాలి. అందులో తెలంగాణ నెంబర్ వన్. ఇక ‘అందులోనూ’ రేవంత్ నెంబర్ వన్.

(ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా రచయితవే)