VRO: గ్రామానికి.. మళ్లీ భూ పరిపాలన అధికారులొస్తే..?
గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల వ్యవస్థను తీసుకు వస్తున్నామని చెప్పుతున్న సర్కారు నిర్దిష్టమైన పని చేసేలా వర్కింగ్ రూల్స్ తీసుకొచ్చి, అమలు చేయించాలని రైతులు కోరుతున్నారు. గతంలోలాగా రెండు మూడు గ్రామాలకు ఒక్క అధికారి కాకుండా ప్రతి ఊరికి ఒక్క అధికారి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

(తిప్పన కోటిరెడ్డి)
భూ భారతి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకొస్తున్నది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. సంక్రాంతి లోగానే గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖలో అవినీతి ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అవినీతి అంతా వీఆర్వోలే చేస్తున్నారని, రెవెన్యూ శాఖలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ వారేనంటూ 2020 సెప్టెంబర్‌లో బీఆరెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. వారి వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మరి వీఆర్వో వ్యవస్థ రద్దు అయిన తరువాత ఆనాడు బీఆరెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా.. రెవెన్యూ శాఖలో అవినీతి అంతం అయిందా? అన్నదే పెద్ద మిస్టరీగా మారింది.
వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత పెరిగిన అవినీతి
రైతులు, భూమి సమస్యలపై పని చేస్తున్న న్యాయ నిపుణులు, ప్రజా సంఘాల నేతలు మాత్రం వీఆర్వో వ్యవస్థ రద్దు తరువాత అవినీతి అమాంతం పెరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతోంది. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత భూమి సమస్య చెప్పుకొంటే వినడానికి ఒక్క అధికారి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని నల్లగొండ జిల్లాకు చెందిన పేద రైతు ఒకరు అన్నారు. ముఖ్యంగా వీఆర్వోలు ఉన్నప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి తమ కళ్ల ముందు కనిపించే వారని, గెట్టు సమస్య ఉన్నా.. రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నా… ఇలా ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా చెప్పడానికి ఒక అధికారి కనిపించే వాడని వెంకటరెడ్డి అనే రైతు తెలిపారు.
అయితే వీఆర్వో వ్యవస్థ రద్దు అయిన తరువాత ఏ చిన్న సమస్యకైనా తాసిల్దార్ వద్దకు వెళ్లి పరిష్కరించాలని చెప్పుకొనే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఏమైనా ఉంటే మీ-సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోండి.. అని చెప్పే వాళ్లని, మీ-సేవ కేంద్రానికి వెళ్లి ధరణి పోర్టల్ ఓపెన్ చేసి ధరఖాస్తు చేయిస్తే రూ.1000 ఫీజు తీసుకునే వారని, ఆ తరువాత కొన్ని రోజులకు రిజక్ట్ అని సమాధానం వచ్చేదని రాంరెడ్డి అనే రైతు తెలిపాడు. వీఆర్వో ఉన్నప్పుడు ఏదైనా పని ఉంటే ఒక వేయి రూపాయలు ఇస్తే ఎంత పని అయినా అయిపోయేదని మరో రైతు చెప్పాడు. ధరణి చట్టం వచ్చిన తరువాత లంచాల రేటు 100 శాతం పెరిగిందని, భూమికి మార్కెట్ లో ఉన్న రేటు బట్టి డిమాండ్ చేసే వారన్న ప్రచారం బలంగా ఉందని న్యాయనిపుణుడొకరు అన్నారు. దీంతో వీఆర్వో వ్యవస్థ రద్దు తరువాత క్షేత్రస్థాయిలో సమస్యను వినే అధికారి కరువయ్యాడని, పైగా లంచాలు పెరిగాయని, లంచం ఇవ్వాలన్న ఎవరిని కలిసి ఇవ్వాలో కూడా సామాన్య రైతుకు అర్థం కాక మధ్య దళారీలను ఆశ్రయించి అనేక మంది రైతులు మోసపోయారని భూమి సమస్యలపై అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు.
ధరణితో పెరిగిన కోర్టు కేసులు
తనకు వచ్చిన భూమి సమస్యను ఎక్కడ ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాని సగటు రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత భూమి సమస్యలపై కోర్టు కేసులు పెరిగాయి. 5 గుంటల భూమి కోసం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తన భూమిని రెవెన్యూ అధికారులు మరొకరికి రిజిస్టర్ చేసి, ఆ వివరాలు బయటకు తెలియకుండా ధరణిలో ప్రైవసీ పేరుతో కనపడకుండా చేశారని, ఈ మేరకు ఆ భూమి డాక్యు మెంట్ల సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ఒక భూ యజమాని హైకోర్టును ఆశ్రయించాడు. ఇలా అనేక మంది రైతులు డాక్యుమెంట్ల కోసం, చిన్న చిన్న సమస్యలకు కూడా కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితిని ధరణి చట్టం ద్వారా నాటి ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇలా వీఆర్ ఓ స్థాయిలోనే రైతులకు అందుబాటులో ఉండాల్సిన సేవలను నాటి ప్రభుత్వం వీఆర్వోలు అంతా అవినీతి పరులంటూ రద్దు చేసింది. తద్వారా గత ప్రభుత్వం రైతులను రెవెన్యూ శాఖకు బాధితులను చేసిందనే విమర్శలు ఉన్నాయి.
గ్రామస్థాయి అధికారులతోనే సత్వర రెవెన్యూ సేవలు
గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఉంటేనే రైతులకు రెవెన్యూ సేవలు సత్వరం అందే అవకాశం ఉంటుందన్నది వాస్తవం. నేరుగా వీఆర్వోలకు సమస్యను పరిష్కరించే అధికారం లేక పోవచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో గ్రామస్థుల ద్వారా వీఆర్వోకు తెలుస్తుంది. నేరుగా సమస్య ఉన్న భూ కమతం వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించి, పక్క రైతుల చేత విచారణ చేసి, నివేదికను రూపొందించి తాసిల్దారుకు సమర్పిస్తాడు. తాసిల్దార్ దీనిని ధృవీకరించుకుని తగిన ఆదేశాలు జారీ చేస్తాడు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వీఆర్వోల ద్వారా సేవలు అందేవి. అయితే నాటి సర్కారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ విభాగంలో లేని విధంగా ఒక్క రెవెన్యూ శాఖలోని వీఆర్వోలే అవినీతికి పాల్పడుతున్నారన్నట్లుగా వ్యవహరించిన తీరు భూమి సమస్యల పరిష్కారాన్ని సంక్లిష్టంగా మార్చిందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
అవినీతి అధికారులు ఉంటే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులతో సోదాలు చేయించి అరెస్టులు చేయించవచ్చు. విచారించి కఠిన శిక్షలు వేయడానికి అవకాశం ఉన్న తరువాత కూడా నాటి సర్కారు ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకున్న తీరుగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పడు గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల వ్యవస్థను తీసుకు వస్తున్నామని చెప్పుతున్న సర్కారు నిర్దిష్టమైన పని చేసేలా వర్కింగ్ రూల్స్ తీసుకొచ్చి, అమలు చేయించాలని రైతులు కోరుతున్నారు. గతంలోలాగా రెండు మూడు గ్రామాలకు ఒక్క అధికారి కాకుండా ప్రతి ఊరికి ఒక్క అధికారి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.