Komatireddy Rajagopal Reddy | సీఎం టార్గెట్‌గా బహిరంగ వ్యాఖ్యలు.. కానీ.. రాజగోపాల్‌పై వేచి చూసే ధోరణి?
సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నదా? కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Komatireddy Rajagopal Reddy | హైదరాబాద్, ఆగస్ట్ 11 (విధాత) : సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నదా? కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటిస్తే.. ఆ వ్యాఖ్యలేవీ తన దృష్టికే రాలేదని మల్లు రవి చెప్పడం చర్చకు దారి తీస్తోంది. ఏవైనా ఆంతరంగిక సమావేశాల్లో మాట్లాడినట్టు వార్తలు వచ్చి ఉంటే అదివేరు విషయం. కానీ.. రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్లు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇందులో రహస్యం కూడా ఏమీ లేదు. పత్రికల్లో, మీడియాతో భారీ చర్చలే నడిచినా.. అవేవీ తమకు తెలియదని మల్లు రవి చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. సీఎంపై చేసిన రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఎవరూ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయలేదు. ఈ వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘం సుమోటోగా కూడా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్‌ను కూడా క్రమశిక్షణ సంఘం తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఏ అంశాలపై చర్చించింది?
ఈ ఏడాది జూలై 8న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. అప్పటి నుంచి ఆయన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోల్ సభలో చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలకు సైతం కౌంటరిస్తూ.. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు. లచ్చమ్మగూడెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నాయకత్వం అమలు చేస్తుందా? చేయదా? అనేది పార్టీ నాయకత్వం ఇష్టమని, అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో తెర వెనుక సాగుతున్న రాజకీయంపై అంతా దృష్టిసారించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని మరో మాట పేల్చారు. సీఎం తన భాషను మార్చుకోవాలని సైతం సూచించారు. ఇలా నేరుగా సీఎంను లక్ష్యంగా చేసుకొని రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. దీనిపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని ప్రశ్నించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని అంటూనే రాజగోపాల్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతానని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్ గా చేసిన విమర్శల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని తప్పించుకున్నారు. ఆదివారం క్రమశిక్షణ సంఘం సమావేశం జరిగింది. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశమే చర్చకు రాలేదని తెలుస్తున్నది. కొండా మురళి, అనిరుధ్ రెడ్డి అంశాలపై మాత్రమే చర్చించారు. అసలు ఈ అంశమే ఎజెండాలో లేదంటే దీనిపై క్రమశిక్షణ సంఘం దీని గురించి ప్రాధాన్యం ఇవ్వలేదనేది అర్ధం అవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం తర్వాత రాజగోపాల్ రెడ్డి అంశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆ అంశమే తమ దృష్టికి రాలేదని మల్లు రవి రొటీన్ డైలాగ్ చెప్పారు. మీడియాలో , సోషల్ మీడియాలో పోస్టులు అన్ని బహిరంగంగానే కనిపిస్తున్నాయని మీడియా ప్రతినిధి మల్లు రవి దృష్టికి తీసుకెళ్లగా.. ఇబ్బంది పడిన రవి.. ‘మీరు చెప్పినట్టే చేయాలా?’అంటూ కస్సుబుస్సు మన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేచిచూసే ధోరణిలో ఉన్నారా?
రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపై హామీ ఇచ్చినప్పటికీ సామాజిక సమీకరణాలతో పాటు జిల్లా రాజకీయాలు ఆయనకు ఆ అవకాశం దక్కకుండా చేశాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కాళ్లు పట్టుకొని పదవులు తెచ్చుకొనే నైజం తనది కాదంటూ సీరియస్ వ్యాఖ్యలే ఆయన చేశారు. సీఎంతో నేరుగా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా క్రమశిక్షణ సంఘం కనీసం చర్చించలేదు. తమ దృష్టికి రాలేదని అంటోంది. అంటే ఈ వ్యాఖ్యలపై సీఎం నేరుగా ఫిర్యాదు చేయాలా? సీఎం తరపున ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు గానీ చర్యలు తీసుకోదా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ సంఘానికి పిలిచి నోటీసులు, చర్యలు అంటే పార్టీకి రాజకీయంగా నష్టమనే అభిప్రాయంతో ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కొండా మురళి ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై వైరి వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం మురళిని పిలిచి, వివరణ కోరింది. తన ప్రత్యర్థులపై మురళి కూడా ఫిర్యాదు చేశారు. కులగణన విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలిసి నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకొందనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది. రాజగోపాల్ రెడ్డికి అంగబలం, ఆర్ధికబలం కూడా ఉంది. గతంలో జరిగిన పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నాయకత్వం వేచి చూసే ధోరణితో వ్యవహారిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నాయకులపై హైకమాండ్‌కు పట్టుందా?
సీఎంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు తమ దృష్టికి రాలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ప్రకటించడంపై పెద్ద ఎత్తునే చర్చ నడుస్తున్నది. భవిష్యత్తులో మరో నాయకుడు అసంతృప్తితో సీఎంపైనో, పీపీసీ చీఫ్ పైనో విమర్శలు చేసినా కూడా అలానే వదిలేస్తారా? లేకపోతే చర్యలు తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకొంటే రాజగోపాల్ రెడ్డి అంశం అప్పుడు ప్రస్తావిస్తే ఏం సమాధానం చెబుతారు? అనే చర్చలు గాంధీభవన్ వర్గాల్లో సాగుతున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరహాలోనే వదిలేస్తే నాయకులు పట్టు తప్పిపోయే చాన్స్ లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినా భవిష్యత్తులో అది పార్టీకి నష్టం చేసే అవకాశం లేకపోలేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.