Congress Politics | కడుపులో కత్తులు.. పైకి కౌగిలింతలు! కాంగ్రెస్ పెద్దల రూటే సపరేటు
నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా పీసీసీ నుంచి ఇన్‌చార్జ్‌లను నియమించిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జరిగిన నేపథ్యంలో సొంత కాంగ్రెస్ పార్టీతో పాటు, రాజకీయ పరిశీలకుల్లో సైతం ఈ అంశం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

Congress Politics | విధాత ప్రత్యేక ప్రతినిధి: కడుపుల్లో కత్తులు దాచుకొని… పైకి మాత్రం కౌగిలింతలు చేసుకున్నంత మాత్రాన అన్నీ మరిచిపోయి ఒక్క సమావేశంతో కలిసిసాగుతారా? అనే చర్చ సాగుతోంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా ఉంటుందని బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ రహస్యంగా సమావేశమవుతుంటారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే.. అన్న మాటను గుర్తు చేస్తూ.. ‘విభేదాలు.. విభేదాలే. గ్రూపులు.. గ్రూపులే’ అని మరికొందరు అంటున్నారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా పీసీసీ నుంచి ఇన్‌చార్జ్‌లను నియమించిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జరిగిన నేపథ్యంలో సొంత కాంగ్రెస్ పార్టీతో పాటు, రాజకీయ పరిశీలకుల్లో సైతం ఈ అంశం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. అడ్లూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సమావేశాన్ని గాంధీభవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతంతో పాటు నామినేటెడ్ పదవుల పంపిణీ, పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందని, తగిన ప్రాతినిధ్యం కల్పించలేదనే అభిప్రాయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.
సమస్య క్రమశిక్షణే!
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకు కత్తులు దూసుకున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు అన్నీ మరిచిపోయి కలిసి సాగుతారా? ఐక్యత లేకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయగలుగుతారా? అనే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో కీలక భూమిక నిర్వహించే ఎమ్మెల్యేలకే సమస్యలున్నాయని చెబుతున్నప్పుడు వీరిని సమన్వయం చేసేదెవరంటున్నారు. తమ పరువు, ప్రతిష్ఠను కాపాడుకుంటూ, తమ కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులను రక్షించుకునేందుకు తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపట్టుదలతో పనిచేస్తారేమోగానీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమన్వయం చేసేవారెవరనే వాదన వినిపిస్తున్నది. ఎమ్మెల్యేలనూ, ఎంపీలను, ముఖ్యనాయకులను సమన్వయం చేయాల్సిన మంత్రితోనే సమస్య ఉత్పన్నమైనపుడు ఎవరు కో ఆర్డినేట్ చేస్తారంటున్నారు. గత కొంత కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, పార్టీ మధ్య సమన్వయంలేదనేది బహిరంగ విషయం. కలిసి నడువడం కాదుకదా? కత్తులు దూసుకునే పరిస్థితికి చేరింది. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు ఒక వైపు మిగిలిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒక వైపుగా సాగుతున్నారు. మరో మంత్రి సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు ఈ విభేదాల పైన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాము జోక్యం చేసుకుంటే తమకెక్కడ చుట్టుకుంటుందోననే ఒకింత భయం వారిలో ఉందంటున్నారు. ఈ స్థితిలో జిల్లాలో సమన్వయం లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పడే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారనే చర్చ సాగుతోంది. అందుకే ముందు క్రమశిక్షణ కమిటీ ముందున్న పంచాయతీని పరిష్కరించి, నేతల మధ్య సమన్వయం సాధించాలని కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి పరిస్థితిలో నిర్వహించే సమావేశాల వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లు ఉన్న సమస్యను తీర్చేందుకు యత్నించి తర్వాత ఐక్యత సాధించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
సంస్థాగత పటిష్టం… నామినేటెడ్ కు ప్రాధాన్యతః మంత్రి సీతక్క
గాంధీభవన్‌లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం పై చర్చసాగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. కింది స్థాయి నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించాం. రాబోయేకాలంలో పార్టీ నాయకులకు పార్టీతో పాటు ప్రభుత్వపదవులు ఇవ్వాలని నిర్ణయించాం. ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు, క్రమశిక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అయితే మంచి వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించడం గమనార్హం.