Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఆ ఇద్దరికీ సవాల్‌!

ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం.. బీజేపీలో ఇద్దరు కీలక నేతలకు సవాలుగా పరిణమించింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ ఉన్నది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌ రామచందర్‌రావు ఎంపికైన తర్వాత వస్తున్న తొలి ఎన్నిక కూడా ఇదే.

Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఆ ఇద్దరికీ సవాల్‌!

Jubilee Hills Bypoll |  హైదరాబాద్‌, జూలై 30 (విధాత) : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మృతితో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం.. బీజేపీలో ఇద్దరు కీలక నేతలకు సవాలుగా పరిణమించింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ ఉన్నది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌ రామచందర్‌రావు ఎంపికైన తర్వాత వస్తున్న తొలి ఎన్నిక కూడా ఇదే. దీంతో ఇక్కడ గెలుపు ఈ ఇద్దరు నాయకులకు ప్రతిష్ఠాత్మకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానం నుంచి ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. గెలిచినా, గెలవకపోయినా ఆశావహులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. బీజేపీ నుంచి కూడా కొందరు ముఖ్యులే ఈ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. నోటిఫికేషన్‌ వెలువడలేదు. కానీ.. ఆలోపే ఇక్కడ ప్రచార కార్యక్రమాలను బీజేపీ మొదలు పెట్టినట్టు కనిపిస్తున్నది. ప్రత్యేకించి ఈ సెగ్మెంట్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ పార్టీ ఫోకస్‌ పెట్టడం ద్వారా ఇక్కడి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. అసెంబ్లీలో తమ సంఖ్యను మరొకటి పెంచుకునేందుక తాపత్రయ పడుతున్నది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకం!

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్క స్థానంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం. ఈ అంశం కూడా కిషన్‌రెడ్డికి కీలకంగా మారిందని అంటున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచందర్ రావు ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వస్తున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. ఇది రామచందర్ రావు పనితీరుకు తొలి పరీక్ష అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి ఎల్ దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, కే మనోహర్, సినీ నటి మాధవీలత ప్రయత్నిస్తున్నారు. ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలుంటాయనే దానిపైనే బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీలోనే అత్యధిక ఓటర్లు

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోనే అత్యధిక ఓటర్లున్నారు. కొత్త ఓటర్లతో కలుపుకొని ఈ ఏడాది జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,89,954. 2,03,137 మంది పురుషులు, 1,86,793 మంది మహిళలు, 24 మంది థర్ట్ జెండర్ ఓటర్లున్నారు. మరో వైపు ముస్లిం ఓటర్ల సంఖ్య 1 లక్ష 30 వేల వరకు ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ స్థానం బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్‌కు 80,549 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్‌కు 64,212 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్న నేపథ్యంలో బీజేపీలోని ఇద్దరు నేతలకు ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షేనని విశ్లేషకులు అంటున్నారు.